సాక్షి, భీమవరం: రాజకీయాల్లోకి రానని, ప్రజలకు సేవచేసే ఉద్దేశం తనకు లేదని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘సైకిల్ టైరు పంక్చర్ అయింది. అందుకే కారులో వచ్చామ’ని చమత్కరించారు. చంద్రబాబు అసలు స్వరూపం బయట పడుతుందన్న భయంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల కాకుండా కొంతమంది అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ సినిమా విడుదల చేయాలనుకున్నప్పుడు సైకిల్ జోరు మీద ఉందని, ఇపుడు సైకిల్‌కు పంక్చర్ పడిందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలను బయటపెట్టడమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
రైతులు కష్టాలు తనకు తెలియదని, తాను ఎప్పుడూ పొలం వెళ్ళలేదని స్పష్టం చేశారు. మహర్షి లాంటి సినిమాను మహేష్‌బాబు లేకుండా తీస్తే ఎవరు చూస్తారని ప్రశ్నించారు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరుతో త్వరలో సినిమా చేయబోతున్నట్టు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. కాగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఈనెల 31న ఆంధ్రప్రదేశ్‌లో విడుదలకానుంది.