సుశాంత్‌ మరణం; కరణ్‌కు మద్దతుగా వర్మ

17 Jun, 2020 16:35 IST|Sakshi

బాలీవుడ్‌ యువ నటుడు సశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తెరపైకి మరో వివాదాన్ని తీసుకొచ్చింది. భారత సినీ పరిశ్రమలో నెపోటిజమ్‌(బంధుప్రీతి) ఎక్కువ ఉందనే వాదన ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. సుశాంత్‌ మరణానికి బంధుప్రీతి కారణమంటూ నెటిజన్లు కరణ్‌ జోహార్‌ను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. తాజాగా ఈ విషయంపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. ఈ మేరకు మంగళవారం సోషల్‌ మీడియాలో బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌కు మద్దతుగా ట్వీట్‌ చేశారు. 

సినీ పరిశ్రమలో బంధుప్రీతిని ప్రోత్సాహిస్తున్నాడని కరణ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని వర్మ ఖండించారు. ‘సుశాంత్‌ మరణంపై కరణ్‌ జోహర్‌ను నిందించడం హాస్యాస్పదంగా ఉంది. ఇది చిత్ర పరిశ్రమపై అవగాహన లేకపోవడాన్ని చూపిస్తుంది. కరణ్‌కు సుశాంత్‌తో సమస్య ఉందని అనుకుంటున్నారు. అయినా ఎవరితో పనిచేయాలనేది కరణ్‌ ఇష్టం. నిర్మాతలు ఎవరితో పని చేయాలనుకుంటున్నారనేది వాళ్ల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది’ అని ట్వీట్‌ చేశారు. 

అలాగే ‘సోషల్‌ మీడియాలో నెపోటిజం గురించి కరణ్‌ జోహర్‌ను విమర్శిచే వాళ్లు ఒక్కరికి కూడా పని ఇవ్వలేరు. కానీ కరణ్‌, ఏక్తా కపూర్‌, ఆదిత్యా చోప్రా వంటి వాళ్లు ఎంతో మందికి పని ఇచ్చార’ని గుర్తు చేశారు. బంధుప్రీతికి అనుకూలంగా మాట్లాడుతూ.. ప్రతి వ్యవస్థలో బంధుప్రీతి పాతుకు పోయిందన్నారు. ఇది లేకుంటే సమాజం కుప్పకూలిపోతుందని వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంధుప్రీతి లేకుండా ఉండాలి అంటే మనం మన కుటుంబాన్ని భార్య, పిల్లలను కూడా ఎక్కువగా ఇష్టపడలేం అని పేర్కొన్నారు. ‘ప్రతికూల సందర్భంలో మాట్లాడే నెపోటిజం ఒక జోక్. ఎందుకంటే మొత్తం సమాజం కేవలం కుటుంబ ప్రేమపై ఆధారపడి ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించారు. 

>
మరిన్ని వార్తలు