ఎన్టీఆర్‌ సాక్షిగా చెప్తున్నా.. న్యాయం చేస్తా : వర్మ

29 Mar, 2019 12:52 IST|Sakshi

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌పై సుప్రీంకు వెళ్తాం : వర్మ

సాక్షి, హైదరాబాద్‌ : ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కానీయకుండా కొన్ని శక్తులు అడ్డుకున్నాయని ఆ సినిమా దర్శకుడు రాంగోపాల్‌ వర్మ విమర్శించారు. సెన్సార్‌ సర్టిఫికేట్‌ వచ్చిన తర్వాత ఓ సినిమాను అడ్డుకోవడం ఇదే మొదటిసారని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పౌరుడిగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గౌరవిస్తూనే.. న్యాయం కోసం సుప్రీం కోర్టుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. నిర్మాతలు రాకేష్‌రెడ్డి, దీప్తి బాలగిరి ఈ విషయమై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఒక రాష్ట్రంలో సినిమా విడుదలై మరో రాష్ట్రంలో నిలిచిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి అని అన్నారు. 

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ను అడ్డుకోవడం ద్వారా ఎన్టీఆర్‌కు మరోసారి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా ఎన్టీఆర్‌కు న్యాయం చేస్తామని..ఏపీలో సినిమా విడుదలకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని ఒకటి రెండు రోజుల్లో అక్కడా కూడా సినిమా విడుదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఎన్టీఆర్‌కు న్యాయం చేస్తామని ప్రమాణం చేసి చెప్తున్నా’ అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం వర్మ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.
(చదవండి : ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ మూవీ రివ్యూ)

అన్యాయమే చూపించాం..
ఈ సినిమాలో.. ఎన్టీఆర్‌కు మోసం, ద్రోహం..  ఏం జరిగింది. ఎలా జరిగింది అనేది చూపించాం. ఒక ఫిల్మ్‌ మేకర్‌గా ఎన్టీఆర్‌ జీవితాన్ని తెరపై చూపించాలనే ఎక్జయిట్‌మెంట్‌తో సినిమా మొదలు పెట్టాను. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు వెల్లడించొచ్చు. పద్మావత్‌, ఉడ్తా పంజాబ్‌ సినిమా విడుదల సందర్భాల్లో.. సెన్సార్‌ సర్టిఫికేట్‌ వచ్చిన తర్వాత ఎట్టిపరిస్తితుల్లో సినిమా ఆపడానికి వీలులేదని కోర్టులు స్పష్టంగా చెప్పాయి. ఆ విధంగా నిబంధనలు కూడా వచ్చాయి. అందుకనే తెలంగాణ హైకోర్టు ఈ సినిమా విడుదలకు కోవర్డ్‌ ఉత్తర్వులు ఇచ్చింది. కానీ, ఊహించని విధంగా ఏపీలో సినిమాకు బ్రేక్‌ పడింది. ఈ సినిమాను ఆపడానికి ఎవరు ఒత్తిడి తెచ్చారో అందరికీ తెలుసు. వారి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. పేరు చెప్పడానికి నాకు ధైర్యం లేదని కాదు. కానీ విషయం కోర్టు పరిధిలోఉంది కాబట్టి పేరు చెప్పడం లేదు.
(చదవండి : ఆ వెన్నుపోటుదారుడెవరో.. అసలు కథ ఇది!)

సినిమా హౌజ్‌ఫుల్‌..
రిలీజైన అన్ని చోట్లా సినిమా హౌజ్‌ఫుల్‌గా ఆడుతోంది. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాలను తెలుసుకోవాలనే ఆసక్తితో ప్రేక్షకులు ఆదిరిస్తున్నారు. ఇక ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదలను అడ్డుకోవడం ద్వారా మీరు వెన్నుపోటుకు గురయ్యారా అన్నప్రశ్నకు.. సినిమాను అడ్డుకొని మహానాయకుడికి మరోసారి వెన్నుపోటు పొడిచారని అన్నారు. నాడు ఎన్టీఆర్‌ సింహగర్జన మీటింగ్‌కు అనుమతినివ్వలేదు. టీడీపీ నాయకులు, ఆయన కుటుంబం ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలవలేదు. క్షోభకు గురిచేసి ఆయన మరణానికి కారణమయ్యారు. కానీ, ఇవాళ మేమంతా ఉన్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకుని ఎన్టీఆర్‌కు న్యాయం చేస్తామని ఆయన సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా అన్నారు.

(చదవండి : ఏపీలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదలకు బ్రేక్‌)

మరిన్ని వార్తలు