ఇలా చేస్తే మీరనుకున్నంటు కోటి మంది వస్తారు!

22 Feb, 2020 16:33 IST|Sakshi

సంచలనం అంటే వర్మ. వర్మ అంటే సంచలనం అనేంతగా ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన ఎప్పుడూ ఎవరిని టార్గెట్‌ చేస్తారో తెలియదు. ఆయన టార్గెట్‌ చేస్తే మాత్రం అది సంచలనం అవ్వాల్సిందే. కాంట్రవర్సియల్ కింగ్‌గా తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఆయనకు అభిమానులేం తక్కువ లేరు. అంతేగాక ఆయనలా మాట్లాడుతూ, డిఫరెంట్‌గా ఉండాలని ఆలోచించే వారు కూడా ఉన్నారు. ఇక కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉన్న వర్మ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనపై ట్విటర్‌ వేదికగా తనదైన శైలిలో స్పందించారు.

(చదవండి : ట్రంప్‌ పర్యటన : కేజ్రీవాల్‌కు అవమానం..!)

ఈ నెల 24న ట్రంప్‌ తన భార్య, సలహాదార్లు ఇవాంకా ట్రంప్‌, జారేద్‌ కుష్నర్‌తో కలిసి భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లో నిర్వహించే రోడ్‌ షో, నమస్తే ట్రంప్‌ కార్యక్రమాలలో ట్రంప్‌ పాల్గొంటారు. భారత పర్యటనపై ట్రంప్‌ భారీ అంచనాలను పెంచుకున్నారు. తనకు స్వాగతం పలికేందుకు కోటి మంది వరకు పాల్గొంటారని భావిస్తున్నారు. అయితే భారత్‌లో ‘లక్ష’ అనే అంకెను ఆయన మిలియన్‌ అని తప్పుగా అర్థం  చేసుకున్నారో ఏమో తెలియదు కానీ, మిలియన్లలో జనం వస్తారని తరచూ చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ పర్యటనపై వర్మ వ్యంగ్యంగా స్పందించారు. ‘ట్రంప్‌కు స్వాగతం పలకడానికి కోటి మంది రావాలంటే.. ఆయనతో పాటు స్టేజీపైన బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమిర్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, సౌత్‌ స్టార్‌ రజనీకాంత్‌, కత్రినా కైఫ్‌, దీపికా పదుకొనెలతో పాటు సన్నీ లియోన్‌లను వరుసగా నిలబెడితే ఆయన అనుకున్నట్లు కోటిమంది వస్తారు’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇక వర్మ ఆలోచనకు ఆయన అభిమానులు మరొసారి ఫిదా అవుతున్నారు.

మరిన్ని వార్తలు