రామ్ గోపాల్ వర్మకు రూ. 10 లక్షల జరిమానా

1 Sep, 2015 09:58 IST|Sakshi
రామ్ గోపాల్ వర్మకు రూ. 10 లక్షల జరిమానా

షోలే సినిమా విడుదలై 40 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికే ఏదో ఒక సందర్భంలో ఈ సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఢిల్లీ హై కోర్టు తీర్పుతో షోలే మరోసారి తెరమీదకు వచ్చింది. 1975లో ఘనవిజయం సాధించిన షోలే సినిమాను రామ్ గోపాల్ వర్మ ఆగ్ పేరుతో 2007లో రీమేక్ చేశాడు. ఒరిజినల్ సినిమాలో హీరోగా నటించిన అమితాబ్ రీమేక్ లో మాత్రం తనకు ఎంతో నచ్చిన గబ్బర్ సింగ్ పాత్రలో కనిపించారు..

అయితే ఆగ్ ఆశించిన స్ధాయి విజయం మాత్రం సాదించలేకపోయింది. షోలే ను రీమేక్ చేయటం చారిత్రాత్మక తప్పిదం అంటూ వర్మ అంగీకరించినా, అభిమానులు మాత్రం క్షమించలేదు. భారతీయ సినీ చరిత్రలో క్లాసిక్ లాంటి అద్భుతాన్ని వర్మ పాడు చేశాడన్నది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అయితే ఆగ్ రిలీజ్ అయి ఏడేళ్లు గడుస్తున్నా వర్మ ఇంకా విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు.

తాజాగా ఢిల్లీ హైకోర్టు కూడా ఈ సినిమా విషయంలో వర్మకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఒరిజినల్ సినిమా నిర్మాతల మనవడు సస్చాసిప్పీ కాపీరైట్ యాక్ట్ కింద వర్మపై నమోదు చేసిన కేసులో, తీర్పును ప్రకటించిన ఉన్నత న్యాయస్థానం, పది లక్షల రూపాయల జరిమానా విధించింది. నిర్మాతల అనుమతి తీసుకోకుండా సినిమాలో సన్నివేశాలు, పాత్రలు, నేపథ్య సంగీతం వాడుకున్నందుకు కోర్టు ఈ తీర్పును ప్రకటించింది.

వర్మతో పాటు ఆగ్ సినిమా నిర్మాతలైన ఆర్ జి వి ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, వర్మ కార్పొరేషన్ లిమిటెడ్, మధు వర్మ కూడా కేసులో దోషులుగా ఉన్నారు. అయితే 2007  ఆగస్టు 31న ఆగ్ రిలీజ్ కాగా 2015లో అదే రోజు ఈ సినిమా పై కాపీరైట్ విషయంలో తీర్పు వెలువడింది.