ఆ సీక్రెట్ మాత్రం చెప్పను: వర్మ

28 Dec, 2015 09:10 IST|Sakshi
ఆ సీక్రెట్ మాత్రం చెప్పను: వర్మ

ఈ సినిమా చూస్తారు!
  ‘‘వీరప్పన్ గురించి కొంచెం కూడా తెలియనివాళ్లు.. వీరప్పన్ గురించి కొంచెం తెలిసినవాళ్లు... వీరప్పన్ గురించి పూర్తిగా తెలిసినవాళ్లు... నాకు తెలిసి ఈ మూడు రకాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూస్తారు’’ అని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ఆయన దర్శకత్వంలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితం ఆధారంగా బీవీ మంజునాథ్, ఇ. శివప్రకాశ్, బీయస్ సుధీంద్ర నిర్మించిన ‘కిల్లింగ్ వీరప్పన్’ జనవరి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ పలు విశేషాలు చెప్పారు.
 
వీరప్పన్ గురించి సినిమా తీయాలనే ఆలోచన మొదటిసారి వచ్చింది ‘క్షణం క్షణం’ సినిమా టైమ్‌లో. ఆ సినిమా షూటింగ్ అడవిలో జరుపుతున్నప్పుడు పోలీసాఫీసర్స్ వచ్చి, ‘జాగ్రత్తగా ఉండండి. డేంజరెస్ ఏరియా’ అనేవారు. పదేళ్ల తర్వాత ‘జంగిల్’ సినిమా షూటింగ్‌కు వెళ్లినప్పుడు కూడా అదే మాట. అప్పుడు వీరప్పన్ గురించి తెలుసుకోవాలనిపించింది. నేను సేకరించిన సమాచారంతో ‘లెట్స్ క్యాచ్ వీరప్పన్’ అనే చిత్రాన్ని షిమిత్ అమీన్ దర్శకత్వంలో మొదలుపెట్టా. మొదటి రోజు చిత్రీకరించాం. అదే రోజు వీరప్పన్ చనిపోవడంతో మా సినిమాకి బ్రేక్ వేసేశాం.
 
ఆ చిత్రాన్ని పక్కన పెట్టినా మనసులో వీరప్పన్ జీవితాని తెరకెక్కించాలనే ఆలోచన అలానే ఉండిపోయింది. అడవి నుంచి బయటకు వచ్చినప్పుడు అతన్ని షూట్ చేస్తే, చనిపోయాడు. అసలు వీరప్పన్ అడవిలోంచి ఎందుకు బయటకు వచ్చాడు? అనే ఆలోచనలోంచి పుట్టిన కథ ఇది. ఏడాది క్రితం ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్‌ను కలిశాను. అప్పుడు కొన్ని నిజాలు తెలిశాయి. వీరప్పన్ అడవిలోంచి బయటకు ఎలా వచ్చాడు? ఎందుకొచ్చాడన్నది ఎవరికీ తెలీదు. వీరప్పన్ మరణించడానికి ఆరు నెలల ముందు ఏం జరిగింది? అతణ్ణి అంతం చేయడానికి వేసిన ప్లాన్స్ ఏంటనేది ఈ చిత్రకథ.
 
  నాకు తె లిసిన పోలీసాఫీసర్ల దగ్గర నుంచి, వీరప్పన్‌కు రాయబార ం అందించిన మీడియేటర్ల వరకూ.. అందరి దగ్గరా సమాచారం సేకరించి ఈ కథ రాసుకున్నాను. ఇది కొంతమందికి కనెక్ట్ కాకపోవచ్చు. అందుకే ఈ టైటిల్ కింద నాకు తెలిసిన నిజమని పెట్టాను.
 
నా దృష్టిలో హీరో వేరు, మెయిన్ క్యారెక్టర్ వేరు. హీరో అందరికీ ఆదర్శంగా ఉండాలి. హిట్లర్ మీద సినిమా తీస్తే అతను హీరో కాలేడు. జస్ట్ మెయిన్ క్యారెక్టర్ అంతే. మదర్ థెరిస్సా మీద సినిమా తీస్తే ఎవరూ చూడరు. ఎందుకంటే మంచివాళ్ల లైఫ్‌లో కన్నా చెడ్డవాళ్ల లైఫ్‌లోనే ఎక్కువ డ్రామా ఉంటుంది. అదే ఆసక్తిగా ఉంటుంది. క్రిమినల్స్‌లోనే ఎమోషనల్ లెవెల్స్ ఎక్కువ. ఎందుకంటే వాళ్లకు ఏదో ఒకటి జరిగితేనే వాళ్లు ఆ ఎక్స్‌ట్రీమ్ స్టెప్ తీసుకుంటారు. ఆ సిట్యుయేషన్‌లోంచే డ్రామా పుడుతుంది. ఇందులో వీరప్పన్ విలన్ అనీ, ఆ పోలీసాఫీసర్ హీరో అని చెప్పలేదు.  
 
వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి... తన భర్త చాలా మంచోడు.. అడవిని పరిరక్షిస్తున్నాడు అని పేర్కొన్న విషయం తెలిసిందే. వీరప్పన్‌ను చూసిన మొదటిసారి ఆమె భయపడితే... ‘‘పువ్వుల వాసన చూస్తానే తప్ప వాటిని నలపను. నువ్వంటే నాకిష్టం. నీకిష్టమైతే పెళ్లి చేసుకుందాం’’ అన్నాడట. అతనిలో రొమాంటిక్ పర్సన్ ఉన్నాడనటానికి ఇదో ఉదాహరణ.
 
వీరప్పన్ గెటప్‌లో సందీప్ భరద్వాజ్‌ని చూసినవాళ్లు విడిగా అతన్ని చూస్తే షాకవుతారు. అతన్నంతలా మలిచిన క్రెడిట్ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్‌ది. సందీప్ తన బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకుని, ఈ పాత్ర చేశాడు. ఈ సినిమా విడుదల తర్వాత అసలు వీరప్పన్‌ని మర్చిపోయి, సందీప్‌ని గుర్తుపెట్టుకున్నా ఆశ్చర్యపోవడానికి లేదు. శివరాజ్‌కుమార్ తండ్రి, నటుడు రాజ్‌కుమార్‌ని కిడ్నాప్ చేసింది వీరప్పన్ గ్యాంగ్ కావడంవల్ల, వీరప్పన్‌ని బయటికి రప్పించడానికి కారణమైన పోలీసాఫీసర్‌కి దగ్గర పోలికలతో శివరాజ్‌కుమార్ ఉండటంవల్ల ఆయనతో ఈ పాత్ర చేయించాను.     
 
ఓ సందర్భంలో పోలీసులకు దొరికిపోతామనే భయంతో కన్న కూతుర్ని వీరప్పన్ రాయికేసి కొట్టి చంపేశాడు. సెన్సార్ నిబంధనలకు మేరకు ఆ సీన్‌లో పాప ఏడుపుని మ్యూట్ చేయాల్సి వచ్చింది. సెన్సార్ బోర్డ్ అప్పట్లో ఏర్పాటైన రూల్స్ ప్రకారం నడుస్తోంది. ఒక హంతకుని జీవితంతో సినిమా తీస్తే భయంకరంగానే ఉంటుంది. అలాంటప్పుడు సినిమాలో ఆ సౌండ్ మ్యూట్ చేయండి... ఈ డైలాగ్ కట్ చేయండని చెప్పడమనేది మీనింగ్‌లెస్. కానీ, సెన్సాన్‌బోర్డ్ తప్పు కాదు. వాళ్ల గైడ్ లైన్స్ అలా ఉన్నాయి. సెన్సార్ బోర్డ్ యాక్ట్‌ను మార్చాలి. వాళ్లను తిట్టాలనుకోవడం స్టుపిడిటీ అవుతుంది.
 
 ఆ సీక్రెట్ చెప్పను!
 డబ్బుతో కొన్న వస్తువును దాచిపెట్టుకుంటే ఏం లాభం? ఉపయోగించడం తెలిస్తే దాని విలువ మనకు తెలుస్తుంది. మా ఫ్రెండ్ ఒకతను ఓ కార్ కొని, దాని మీద కవర్ వేసి అలానే ఉంచేశాడు. నా దృష్టిలో మనీ అనేది కెనైటిక్ ఎనర్జీలా ట్రాన్స్‌ఫర్ కావాలి గానీ పొటెన్షియల్ ఎనర్జీలా మన దగ్గరే ఉండిపోకూడదు. కోట్లు ఖర్చుపెట్టడానికి ఓ వస్తువు కొన్నాడంటే నేను ఆనందపడను కానీ, వాడి ఆనందం కోసం కోట్లు ఖర్చుపెడుతున్నాడంటే అప్పుడు ఆనందంగా ఉంటుంది. నేను కరెన్సీ నోట్స్‌ని ముట్టుకోనని జగన్ (పూరి జగన్నాథ్) చెప్పినది నిజమే. కరెన్సీని తాకాలంటే ఇరిటేషన్. మేథ్స్ అంటే చిరాకు. నాకు చెక్‌కీ, డ్రాఫ్ట్‌కి డిఫరెన్స్ తెలీదు. కరెన్సీ ముట్టుకోకుండా, క్రెడిట్ కార్డ్ వాడకుండా ఎలా బతికేస్తున్నాను? అని చాలామందికి డౌట్. ఆ సీక్రెట్ నేను చెప్పను.
 
 ట్రైలర్ సూపర్ - అమితాబ్
 ‘కిల్లింగ్ వీరప్పన్’ ట్రైలర్ చాలా సహజత్వంగా ఉందనీ, ఆశ్చర్యచకితులను చేసే విధంగా ఉందని ఇటీవల బిగ్ బి అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. ‘‘ఒక తెలుగు సినిమా గురించి అమితాబ్ బచ్చన్‌గారు ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి. సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు, రా మూవీస్ తీయడంలో నేను బెస్ట్ అని ఆయన అభిప్రాయం’’ అని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. అమితాబ్ బచ్చన్ హీరోగా ‘సర్కార్-3’ చిత్రం రూపొందించాలనుకుంటున్నాననీ, వచ్చే ఏడాది జూన్‌లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభమవుతుందని ఆయన తెలిపారు.