వచ్చే జన్మలో అయినా నీకోసం పుట్టమ్మా.. : వర్మ

28 Feb, 2018 16:42 IST|Sakshi
శ్రీదేవి పార్థీవ దేహం, రామ్‌గోపాల్‌ వర్మ (ఇన్‌సెట్‌లో ఫైల్‌ ఫొటో)

సాక్షి, ముంబయి : ఆయనకు ఇష్టమైన నటి, ప్రాణంకంటే ఎక్కువగా ఆరాధించే దేవత.. ఆమె అంటే తనకు పడిచచ్చిపోయేంత ప్రేమ అంటూ బహిరంగంగానే ఎన్నోమార్లు చెప్పిన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ హఠాన్మరణం చెందిన ప్రముఖ నటి శ్రీదేవికి వీడ్కోలుతోపాటు ఓ విజ్ఞప్తితో కూడిన సందేశాన్ని పంచుకున్నారు. తాజాగా ఆయన ట్విటర్‌ ద్వారా లక్ష్మీ భూపాల అనే వ్యక్తి శ్రీదేవికి వీడ్కోలు పలుకుతూ రాసిన భావోద్వేగాలతో కూడిన లేఖను పంచుకున్నారు. ఆ వీడ్కోలు సందేశంలో శ్రీదేవిని అమ్మా శ్రీదేవి అంటూ సంబోధించారు. బాల్యం నుంచే శ్రీదేవి చాలా కోల్పోయిందని, తల్లిదండ్రులను పోషించడానికి, కుటుంబాన్ని, బంధువులను ఉద్దరించడానికి అలుపు లేకుండా ఆమె నటనతోనే జీవితాన్ని ముగించారని అన్నారు.

అనూహ్యంగా వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లిగా మారి కెమెరాలకు కొన్నాళ్లకు దూరంగా ఉండి పోయారని, కుటుంబానికే అంకితమయ్యారని, అక్కడ కూడా ఆమె సుఖపడింది లేదని చెప్పారు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్న ఆమె నటనలోనే ఉండిపోయి జీవించడం మర్చిపోయారని, చివరకు జీవితాన్నే కోల్పోయారని చెప్పారు. ఈ జన్మకు దురుదృష్టవంతురాలైన పరిపూర్ణ మహిళకు భౌతిక వీడ్కోలు అంటూ ఆయన చివరి వీడ్కోలు సందేశాన్ని ప్రారంభించి వచ్చే జన్మలో అయినా నీ కోసం పుట్టమ్మా అని ముగించారు. దీనిని రామ్‌గోపాల్‌ వర్మ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.

మరిన్ని వార్తలు