'బాహుబలికి అవార్డ్ రాలేదు'

29 Mar, 2016 13:03 IST|Sakshi
'బాహుబలికి అవార్డ్ రాలేదు'

మీడియాలో పాపులర్ అయిన ప్రతీ అంశాన్నీ తన ట్వీట్ల కోసం ఉపయోగించుకునే రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ట్విట్టర్ కు పని చెప్పాడు. అయితే ఎక్కువగా విమర్శలకే టైం కేటాయించే వర్మ.. ఈసారి మత్రం ఓ చిత్ర యూనిట్‌ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు. తాజాగా సినీరంగానికి సంబందించిన జాతీయ అవార్డులను ప్రకటించగా, దక్షిణాది చిత్రం బాహుబలి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ విషయం పై స్పందించిన వర్మ, తన మార్క్ కామెంట్లతో ఎంటర్‌టైన్ చేశాడు.

'బాహుబలి చిత్రానికి జాతీయ అవార్డ్ దక్కలేదు, జాతీయ అవార్డుకే బాహుబలి దక్కింది' అంటూ తనదైన లాజిక్ చెప్పాడు. బాహుబలి లాంటి చిత్రాన్ని జాతీయ అవార్డుకు ఎంపిక చేసే అవకాశం వచ్చినందుకు అవార్డ్ కమిటీ సభ్యులకు తన శుభాకాంక్షలు తెలియజేశాడు. అంతేకాదు జ్యూరీ సభ్యులకు బాహుబలి 2 సినిమాను కూడా ఎంపిక చేసే అవకాశం రావాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశాడు వర్మ.