ఈ రాంగోపాల్ వర్మకు ఏమైంది?

6 Sep, 2016 10:27 IST|Sakshi

తల్లి.. తండ్రి.. గురువు.. ఈ ముగ్గురూ దైవంతో సమానం అంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా, మనకు చిన్నతనం నుంచి పాఠాలు బోధించిన గురువులను ఎట్టి పరిస్థితుల్లోనూ మరువం. వారిని తలుచుకుంటేనే గౌరవభావం ఉప్పొంగుతుంది. కానీ ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది మరో దారి అంటారు. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీరు అలాగే ఉంది. తాను ఎప్పుడూ నేర్చుకోలేదని.. అందరికీ నేర్పేవాడినని, అందువల్ల తనకు తానే హ్యాపీ టీచర్స్‌ డే చెప్పుకొంటానని, మిగిలినవాళ్లకు మాత్రం అన్‌హ్యాపీ టీచర్స్‌డే అంటూ ట్వీట్ల వర్షం మొదలుపెట్టాడు. పనిలో పనిగా పిల్లలకు ఓ పనికిమాలిన సలహా కూడా ఇచ్చాడు. స్కూల్లో టీచర్లతో సమయం వృథా చేసుకోవద్దని, కేవలం గూగుల్ నుంచే నేర్చుకోవాలని తెలిపాడు. తాను తన టీచర్లందరినీ ద్వేషించేవాడినని, అందుకే క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూడటం వల్ల తాను దర్శకుడిని అయ్యానని చెప్పుకొచ్చాడు.

తన టీచర్లందరికంటే తానే ఎక్కువ విజయాలు సాధించానని, దాన్నిబట్టి తనకు తన టీచర్లు అందరికంటే ఎక్కువ తెలుసని అర్థమవుతోందని రాంగోపాల్ వర్మ అన్నాడు. టీచర్ల కంటే క్లాసులో గొడవల నుంచే తాను ఎక్కువగా నేర్చుకున్నానని.. వాటిలో తాను తిరగబడే మనస్తత్వం గురించి తెలుసుకుని, దాన్ని శివ, సత్య లాంటి సినిమాల్లో ఉపయోగించానని చెప్పాడు. టీచర్లను ద్వేషించడానికి ప్రధాన కారణం.. వాళ్లు తనను క్లాసులో కామిక్ పుస్తకాలు చదవనివ్వకపోవడమేనని అన్నాడు. స్కూలు, కాలేజిలో కొందరు టీచర్లు తనతో బలవంతంగా చదివించేవాళ్లని, జీవితంలో అత్యంత దారుణమైన రోజులు అవేనని చెప్పాడు. ప్రతిరోజూ స్కూల్లో పాఠాలు అయిపోయిన తర్వాత.. వాళ్లు చెప్పినవి మర్చిపోడానికి రెండు  కామిక్ పుస్తకాలు, ఫిక్షన్ నవలలు చదివేవాడినని కూడా అన్నాడు. సాధారణంగా తాను విస్కీ తాగనని, కానీ టీచర్స్ విస్కీ మాత్రం ఇష్టమని ముక్తాయించాడు.

మరోవైపు ఉపాధ్యాయులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని..వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీఎస్టీయూ సంఘం విజయవాడలోని గవర్నర్ పేట పీఎస్‌లో రాంగోపాల్ వర్మపై ఫిర్యాదు చేసింది. కర్నూలు జిల్లాలోని నంద్యాల టూటౌన్ పీఎస్‌లోనూ వర్మపై ఏపీ ఎస్టీయూ ఫిర్యాదు చేసింది.

 

>