రేణుక, ఆమె బిడ్డకు సాయం చేయండి: ఆర్జీవీ

7 Mar, 2020 11:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుకకు ఆర్థిక సహాయం అందించాలని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పిలుపునిచ్చారు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన రేణుక భవిష్యత్తు బాగు కోసం తోచిన విధంగా విరాళం అందించి తనను ఆదుకోవాలని కోరారు. ‘‘చెన్నకేశవులు భార్య రేణుక పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారు. అయితే రేపిస్టుల నీడ వారి భవిష్యత్తుపై పడకుండా ఉండాలంటే.. దయచేసి ఎవరికి తోచిన సాయం వారు చేయండి’’అని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. యాక్షన్‌ ఎయిడ్‌ ఫర్‌ సోసైటల్‌ అడ్వాన్స్‌మెంట్‌(ఏఏఎస్‌ఏ) అకౌంట్‌ నంబరును షేర్‌ చేసి... రేణుకకు విరాళం ఇవ్వాల్సిందిగా కోరారు. కాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగే నాటికి చెన్నకేశవులు భార్య రేణుక గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే.(నేను విన్న అత్యంత అసహ్యకరమైన విషయం: వర్మ)

ఇక రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీపంలో మెటర్నరీ వైద్యురాలిపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి.. అనంతరం ఆమెను తగులబెట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా వారిని ఘటనాస్థలికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించగా వారిని ఎన్‌కౌంటర్‌ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం దిశ అత్యాచారం, హత్య, నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఇక ఈ దిశ ఘటనపై తాను సినిమా తీస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు.. నిందితుల కుటుంబాల గురించి తెలుసుకోవడానికి నిందితుడు చెన్న కేశవులు భార్య రేణుకను ఆయన ఇటీవల కలిశారు. పలువురు పోలీసు అధికారులతోనూ భేటీ అయ్యారు. (దిశ: శంషాబాద్ ఏసీపీతో రామ్‌గోపాల్‌ వర్మ భేటీ)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా