ఎలాంటి పాత్రలైనా ఓకే

22 Mar, 2019 00:13 IST|Sakshi

‘‘చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి. ‘భేతాల మాంత్రికుడు, ఐ యామ్‌ ఇండియన్‌’ వంటి చిత్రాల్లో బాల నటుడిగా నటించాను. హీరోగా నా తొలి చిత్రం ‘ఇట్స్‌ మై లైఫ్‌’’ అన్నారు రామ్‌ కార్తీక్‌. ఆయన హీరోగా అశోక్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ‘మౌనమే ఇష్టం’, కిషోర్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ’ సినిమాలు ఈ నెల 15న రిలీజయ్యాయి. ఈ సందర్భంగా రామ్‌కార్తీక్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మా నాన్న సత్యనారాయణ బిజినెస్‌మేన్‌.. అమ్మ రమాదేవి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ‘జూడో’ టీమ్‌కి రిప్రజెంటేటివ్‌.

అమ్మ మంచి క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా. తమ్ముడు కిరీటి ఫారిన్‌లో జాబ్‌ చేస్తున్నాడు. నేను బీబీఏ చేశా. ఎంబీఏ చదువుతున్నప్పుడు నటనలో శిక్షణ తీసుకుందామనుకున్నా. ఆడిషన్స్‌ ఎలా జరుగుతాయోనని చూడ్డానికి   రామానాయుడు ఫిల్మ్‌ స్కూల్‌కి   వెళితే, డైరెక్టర్‌ రామినేని నేతాజీగారు నటనపై ఆసక్తి ఉందా? అంటే.. అవునన్నా. నాకొచ్చింది చేసి, చూపించా. మూడు రోజుల తర్వాత ‘ఇట్స్‌ మై లైఫ్‌’కి నువ్వే హీరో అని నేతాజీగారు అనడంతో షాకయ్యా. మా పేరెంట్స్‌తో చెబితే, ‘ఎందులోనైనా కష్టపడటం అన్నది ముఖ్యం. నీ బెస్ట్‌ ఇవ్వు’ అని ప్రోత్సహించారు. సినిమాల ఎంపికలో నా తొలి ప్రాధాన్యం కథ, నా పాత్రకే. హీరోగానే కాదు.. బలమైన పాత్ర ఉంటే ఎలాంటి రోల్స్‌ చేయడానికైనా సిద్ధమే.

కాంచిగారి దర్శకత్వంలో నేను చేసిన ‘షో టైమ్‌’లో నాది నెగటివ్‌ రోల్‌. ‘అర్జున్‌రెడ్డి’లో విజయ్‌ దేవరకొండ, ‘96’లో విజయ్‌ సేతుపతిగారు చేసినటువంటి పాత్రలు చేయాలనుంది. ‘దృశ్యకావ్యం, మామ ఓ చందమామ’ చిత్రాలకు నటుడిగా మంచి పేరొచ్చింది. ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ, మౌనమే ఇష్టం’ సినిమాలకు మంచి స్పందన రావడం హ్యాపీగా ఉంది. అయితే ఇప్పటివరకూ నాకు సరైన గుర్తింపు రాలేదనిపిస్తోంది. అందుకు కారణం నా చిత్రాలకు సరైన ప్రమోషన్స్‌ లేకపోవడమే. ప్రస్తుతం చదలవాడ శ్రీనివాస్‌గారి బ్యానర్‌లో చేస్తున్న సినిమా పూర్తి కావచ్చింది. మరో సినిమా కథాచర్చలు, అలాగే తెలుగు, తమిళ్‌లో రూపొందనున్న మరో సినిమాకి కూడా చర్చలు జరిగాయి.

మరిన్ని వార్తలు