అలా ముందుకెళితేనే...ఈ రంగంలో రాణించగలం..!

23 Aug, 2014 22:44 IST|Sakshi
అలా ముందుకెళితేనే...ఈ రంగంలో రాణించగలం..!

 సందర్భం  రామజోగయ్య శాస్త్రి పుట్టినరోజు

భక్తి, రక్తి, విరక్తి, ట్రెండీ.. ఇలా ఏ తరహా పాటనైనా సరే... సునాయాసంగా, జనరంజకంగా రాయగల దిట్ట -  రామజోగయ్యశాస్త్రి. సందర్భం చెబితే చాలు అలవోకగా అందుకుంటారాయన. దశాబ్దకాలంగా తన సాహిత్యంతో శ్రోతలను తన్మయానికి గురి చేస్తున్న ఈ సినీకవి పుట్టినరోజు ఇవాళే. ఈ సందర్భంగా ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్‌వ్యూ.


 
 పాటల ప్రయాణం ఎలా ఉందండీ?
 హాయిగా, ఆహ్లాదకరంగా ఉంది.
 
 ప్రస్తుతం ఏ సినిమాలకు రాస్తున్నారు?
 అది పెద్ద లిస్టే. ప్రస్తుతం తయారీలో ఉన్న దాదాపు పెద్ద సినిమాలన్నింటికీ రాస్తున్నా. కెరీర్ అయితే స్పీడ్‌గానే ఉంది. అనువాద చిత్రాలకు కూడా రాస్తున్నాను. కమల్‌హాసన్ ‘మన్మథబాణం’, ‘విశ్వరూపం’ సినిమాలకు రాశాను. రానున్న శంకర్ ‘మనోహరుడు’కి కూడా ఓ పాట రాశాను. భాష వేరైనా వారి అభినయాన్ని బట్టి సాహిత్యాన్ని సమకూర్చే శక్తి నాలో ఉంది. అనువాద చిత్రాలకు రాయడం వల్ల... కమల్‌హాసన్, శంకర్ లాంటి గొప్పవారి అభిమానాన్ని పొందగలిగాను.
 
 ఇంత బిజీగా ఉండి... టీవీ సీరియల్స్‌కి కూడా రాసినట్టున్నారు?
 ‘సీతామాలక్ష్మి’ సీరియల్ కోసం రాశాను. నాగబాబుగారికి నేనంటే అభిమానం. ఆయనంటే నాకు గౌరవం. అందుకే... అడగ్గానే రాశాను. ఆ పాటకు మంచి పేరొస్తుంది.
 
 మీ ఇంట్లోనే మీరేనా, ఇంకెవరైనా కవులు ఉన్నారా?
 మా తాతయ్య పమిడి రామజోగయ్యశాస్త్రిగారు కవి. మల్లికార్జున శతకం రచించారాయన. అలాగే... కపోతేశ్వరచరిత్ర అనే గ్రంథాన్ని కూడా రాశారు. ఆయన ద్వారానే నాకు ఈ సాహిత్యం అబ్బిందేమో!
 
 అసలు పాటల ప్రయాణం ఎలా మొదలైంది?
 మాది గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర ముప్పాళ్ల. బ్రాహ్మణ కుటుంబం. చిన్నప్పటి నుంచీ తెలియకుండానే కళలపై ఆసక్తి. మా బావ గారు భాషానాటకాలు ఆడేవారు. ఫుల్ ఆర్కెస్ట్రాతో రిహార్సల్స్ ఉండేవి. అక్కడే ‘వయసు పిలిచింది’ సినిమాలోని ‘ముత్యమల్లే మెరిసిపోయే మల్లెమొగ్గ’ పాట నేర్చుకున్నా. ఓ సారి పెళ్లిలో మైక్ ఇస్తే ఈ పాట పాడేశా. స్పందన బావుంది. ఇక స్కూల్‌లో కూడా నాతో పాడించడం మొదలుపెట్టారు. బెంగళూరు వెళ్లినప్పుడు కాలేజ్‌లో పాడేవాణ్ణి. ఖరగ్‌పూర్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా పాడేవాణ్ణి. అప్పటివరకూ నేను పాటగాణ్ణే అనుకున్నా.

 

రాతగాణ్ణి అని తెలీదు. ఓ సారి బెంగళూరులో పాట పాడటానికి ఓ రికార్డింగ్ స్టూడియోకి వెళ్లా. వాళ్లు నా వాయిస్ టెస్ట్ చేశారు. అక్కడున్న వారందికీ ఫ్రెండ్ అయిపోయాను. ‘బాగా పాడుతున్నావ్ కానీ... ప్రొఫెషనల్ సింగర్‌గా రాణించేంత విషయం నీ పాటలో లేదు. పైగా శాస్త్రీయంగా సంగీతం నేర్చుకోలేదు కదా. అయితే... మేం పాట రాస్తుంటే మాటలు బాగా అందిస్తున్నావ్. ప్రయత్నిస్తే మంచి గీత రచయితవి అవుతావ్’ అని అక్కడ కొందరు సలహా ఇచ్చారు. వాళ్లే ప్రాజెక్ట్ ఇప్పించారు. ఆ తర్వాత కన్నడ రవిచంద్రన్‌గారితో పరిచయం, తద్వారా కృష్ణవంశీగారికి కలవడం, ఆయన ద్వారా మా గురువుగారు సిరివెన్నెల సాంగత్యం లభించడం... ఇక ఆ తర్వాత మీకు తెలిసిందే..
 
 ఇప్పుడు స్టార్ అయ్యారు కదా. మరి గాయకునిగా కూడా ప్రయత్నించొచ్చుగా?
 ఇటీవల వేటూరిగారి సంస్మరణ సభలో ఆయనే రాసిన ‘సిరిమల్లె నీవే... విరిజల్లు కావే’ పాట పాడాను. దాని వీడియోను ఫేస్‌బుక్‌లో పెడితే మంచి స్పందన లభించింది. అలాగే... ‘దూకుడు’లో ‘అదరగొట్టు... అదరగొట్టు’ పాట నాజర్‌కి పాడింది నేనే. అలా అప్పుడప్పుడు గళానికి పని చెబుతూనే ఉన్నాను. అయితే... పూర్తిస్థాయిలో గాయకునిగా రాణించే శక్తి నాలో లేదు.
 
 ‘కింగ్’ సినిమాలో నటించారు కదా. మళ్లీ ట్రై చేయలేదేం?
 ఏదో సరదాగా చేశానండీ. రెండు పడవలపై ప్రయాణం చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం.
 
 గొప్ప పాట రాసే సందర్భాలు నేటి సినిమాల్లో కరువయ్యాయని టాక్. మీరేమంటారు?
 నిజానిజాలు ఎలా ఉన్నా... గీత రచయితలుగా మా వరకూ మేం సంతృప్తిగానే ఉన్నాం. కాలానుగుణంగా అడుగులు వేస్తూ, అడపాదడపా వచ్చే మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లినప్పుడే ఈ రంగంలో రాణించగలం. మనకు వచ్చిన అవకాశాన్ని ఎంత చక్కగా వినియోగించుకున్నాం అనేది ఇక్కడ ముఖ్యం. అయితే... విలువల విషయంలో మాత్రం రాజీ పడకూడదు. సాధ్యమైనంతవరకూ పాట ద్వారా మంచే చెప్పాలి.
 
 మీ తరం గీత రచయితల్లో మీకు నచ్చిన రచయిత?
 అందరూ సమర్థులే. ఎవరి ప్రత్యేకతలు వారికున్నాయి.
 
 ఇలాంటి పాట నాకొస్తే బావుండేది... అని మీకు అనిపించిన గీతం ఏదైనా ఉందా?
 ప్రత్యేకించి  అలాంటి పాట అయితే... ఏదీ లేదు కానీ... నాకు ప్రేమగీతాలు రాయాలని కోరిక మొదట్నుంచీ ఉండేది. దిల్ రాజుగారు అలాంటి సినిమాలు ఎక్కువగా తీస్తారు. అందుకే... ఆయన సినిమాలకు పాటలు రాయాలని ఆశించేవాణ్ణి. అయితే... వంశీగారి ‘గోపి గోపిక గోదావరి’ సినిమాతో ఆ కోరిక తీరిపోయింది. ఆ సినిమా కోసం నేను రాసిన ‘నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల...’ పాట నాకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చాలా ప్రేమగీతాలు రాశాను.
 
 గీత రచయితగా మీ లక్ష్యం?
 లక్ష్యం అనేదాన్ని నేను నమ్మను. ‘గమనమే నీ గమ్యం అయితే... బాటలోనే బతుకు దొరుకు’ అన్నారు సిరివెన్నెల. నేను నమ్మే సిద్ధాంతం అదే. వచ్చిన పని నిజాయితీగా చేయడం, కుదిరినన్ని పాటలు రాయడం... తర్వాత ఈశ్వరేచ్ఛ.
  బుర్రా నరసింహ