స్టార్ మాలో రామాయణం

14 Jun, 2020 15:17 IST|Sakshi

తొలిసారిగా రామానంద్ సాగర్ రామాయణం తెలుగులో !

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, బంధాలలోని గొప్పతనాన్ని, విలువలతో కూడిన జీవన విధానాన్ని చెప్పే ఇతిహాసం రామాయణం. తండ్రిమాటను జవదాటని కుమారుడు...ఆ కుమారునిపై అవాజ్యమైన ప్రేమను కురిపించే తండ్రి, పతి బాటలలోనే సతి అనే ఇల్లాలు... ఇలా ఎన్నో బంధాలు, మరెన్నో జీవనసత్యాలను తెలియజేసే మహోన్నత పౌరాణిక గాథ రామాయణం. భారతీయ జీవనగమనంలో అంతర్భాగమైన ఈ పుణ్యగాథ నేటి తరానికి మార్గనిర్ధేశకం.

టెలివిజన్ చరిత్రలో ఓ సంచలనంగా 1980లలో రామానంద్ సాగర్ తీసిన రామయణ్ గాథను ఇప్పుడు తెలుగులో స్టార్ మా ఛానెల్ ప్రసారం చేయబోతుంది. అంతర్జాతీయంగా ఓ పౌరాణిక గాధకు అత్యధిక వీక్షణ రేటింగ్ తెచ్చుకోవడం ద్వారా గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న రామాయణ్‌ను లాక్‌డౌన్ కాలంలో పునః ప్రసారం చేశారు. అయితే హిందీ భాషలో ఉండటం, భావం అర్థం అయినా భాష అర్థంగాక పోవడం వంటి సమస్యలను కొంతమంది అభిమానులు ఎదుర్కొన్నారు.

ఈ సమస్యలకు తగిన పరిష్కారం అందిస్తూనే రామానంద్ సాగర్ తీసిన 'రామాయణ్' సీరియల్‌ను స్టార్ మా ఛానెల్ తెలుగులో ప్రసారం చేయబోతుంది. ఈ సీరియల్ కోసం తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు అనకాపల్లికి చెందిన వృద్ధురాలు సావిత్రమ్మ. తన యుక్త వయసులో తాను ఈ సీరియల్‌ను దూరదర్శన్‌లో ఆదివారం పూట వీక్షించేవారమంటూ, అప్పట్లో ఇంటిల్లిపాది ఈ సీరియల్‌నూ క్రమం తప్పకుండా చూసేవారమని, మరలా ఇన్నాళ్లకు లాక్‌డౌన్‌లో మరలా ప్రసారం చేయడం చూశామన్నారు. 

భాష అర్థంగాకపోవడం కొంత సమస్యగా ఉండేది కానీ ఇప్పుడు స్టార్ మా వారు తెలుగులో ప్రసారం చేస్తున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉందన్నారు. ఆమెనే మాట్లాడుతూ భారతీయ జీవనశైలికి ప్రతిరూపం రామాయణం. కనుమరుగవుతున్న కుటుంబ బంధాల వేళ పరమ పవిత్రమైన రామాయణ మహాకావ్యం మనందరికీ జీవనముక్తి మార్గం చూపడమే కాదు బంధాలను ఎలా నిలుపుకోవాలో కూడా చూపుతుందన్నారు. ఈ ధారావాహిక సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతి రోజూ సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతుంది.

మరిన్ని వార్తలు