సరోజినీ నాయుడుగా...

3 Apr, 2020 01:02 IST|Sakshi
దీపికా చిఖలియా

స్వాతంత్య్ర సమరయోధురాలు, కవయిత్రి, స్వతంత్ర భారతదేశ తొలి మహిళా గవర్నర్, నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా పేరు పొందిన సరోజినీ నాయుడు బయోపిక్‌ తెరకెక్కనుంది. సరోజినీ నాయుడు పాత్రను దీపికా చిఖలియా పోషించనున్నారు. ‘రామాయణ్‌’ (1987) టీవీ సీరియల్‌లో సీతగా నటించి, అప్పటి తరానికి అభిమాన తారగా మిగిలిపోయారు దీపికా. అప్పట్లో ఆమెను అసలు పేరుతో కాకుండా ‘సీత’ అనే చాలామంది పిలిచేవారు. ఆ పాత్రను అంత అద్భుతంగా చేశారు దీపికా. ఆ తర్వాత నటిగా వెండితెరపై కూడా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారామె.

1991లో ఎన్టీఆర్‌ నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంలో చంద్రమతిగా నటించారు దీపిక. హిందీ, తమిళం, గుజరాత్‌ భాషల చిత్రాల్లోనూ నటించారు. ప్రస్తుతం హిందీ చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తున్నారు. సరోజినీ నాయుడు బయోపిక్‌ గురించి దీపిక మాట్లాడుతూ– ‘‘సరోజినీ నాయుడు బయోపిక్‌లో నటించే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆన్‌లైన్‌లో సరోజినీగారి గురించి వెతికాను. నాకు కావాల్సినంత సమాచారం దొరకలేదు. రైటర్‌ ధీరజ్‌ మిశ్రా ఈ బయోపిక్‌ గురించి చెప్పారు. అయితే నేనింకా సైన్‌ చేయలేదు. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత పూర్తి స్క్రిప్ట్‌ విని నిర్ణయం తీసుకుంటాను’’ అని పేర్కొన్నారు. ధీరజ్‌ మిశ్రాయే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని బాలీవుడ్‌ టాక్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు