ప్రేక్షకుల అంచనాలకు దూరంగా 'రామయ్యా వస్తావయ్యా'

12 Oct, 2013 11:07 IST|Sakshi
ప్రేక్షకుల అంచనాలకు దూరంగా 'రామయ్యా వస్తావయ్యా'
గత కొద్దికాలంగా భారీ విజయం కోసం ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్, 'గబ్బర్ సింగ్' లాంటి సంచలన విజయం దక్కించుకున్న హరీష్ శంకర్ కలయికలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం ప్రేక్షకుల వద్దకు వస్తుందంటే భారీ అంచనాలు ఉండటం సహజం. అలాంటి భారీ అంచనాలకు తోడుగా దిల్ రాజు నిర్మాణ సారధ్యం.. ఇటీవల కాలంలో వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న సమంత.. గబ్బర్ సింగ్ హిట్ తో శృతి హాసన్ ఈ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టారు. వీటన్నింటికి తోడు తమన్ సంగీతం..  హరీష్ శంకర్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఎన్నో ప్రత్యేకతలు ఉన్న 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం అక్టోబర్ 11 తేదిన సినీ అభిమానులు ముందుకు వచ్చింది. అయితే సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నింపిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం ఏమేరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
 
అల్లరి చిల్లరిగా తిరిగే  రాము ఉరఫ్ నందు అనే స్టూడెంట్.. ఆకర్ష అనే అమ్మాయి ప్రేమలో పడుతాడు.. తన ప్రేమను ఒప్పింపి..మెప్పించడంలో సఫలమవుతాడు. అయితే  ఆకర్ష అక్క పెళ్లికి అతిధిగా రాము వెళుతాడు. పెళ్లికి వెళ్లిన రాము ఆకర్ష  తండ్రిని దారుణంగా చంపుతాడు. తాను ఇష్టంగా ప్రేమించిన అమ్మాయి తండ్రిని రాము ఎందుకు చంపాల్సి వచ్చింది? అందుకు కారణాలేమిటి అనే ప్రశ్నలకు సమాధానమే 'రామయ్యా వస్తావయ్యా'.
 
డైలాగ్స్ పేల్చడంలో.. డాన్స్ లను ఇరగదీయడంలో... ఫెర్మార్మెన్స్ తో మంత్రముగ్ధుల్ని చేయడంలో యువతరం నటుల్లోజూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక్కరనేది కాదనలేం. గతంలో తన చిత్రాలతో జూనియర్ ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకున్నాడు కూడా.. అయితే ఇటీవల కాలంలో జూనియర్ కథలను ఎంచుకోవడంలో కొంత తడబాటుకు గురవుతున్నాడని ఇటీవల ట్రాక్ రికార్డును తిరిగేస్తే స్పష్టంగా అర్ధమవుతోంది. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, ఎమోషన్స్, కామెడీ అంశాలతో మూస చిత్రాలకే పరిమితం అవుతున్నాడనేది పరిశ్రమలోనూ, అభిమానుల్లోనూ ఓ వాదన. ఆ వాదనకు తగ్గట్టూగానే ఎన్టీఆర్ రామయ్యా వస్తావయ్యా చిత్రాని అంగీకరించాడేమో అనిపిస్తుంది. రామయ్య వస్తావయ్యా చిత్రంలో రాము పాత్ర జూనియర్ ఎన్టీఆర్ కు ఖచ్చితంగా సరిపోయే పాత్రనే. కాని.. జూనియర్ నుంచి అభిమానులు, ప్రేక్షకులు వైవిధ్యమైన చిత్రాలను ఆశిస్తున్నారనే అంశం ప్రస్తుతం గమనించాల్సిన అంశం. రాము పాత్రకు జూనియర్ పూర్తి న్యాయం చేశాడనే విషయంలో డౌట్ అనవసరం. 
 
ఇంకా ఆకర్ష పాత్రలో సమంత మళ్లీ గ్లామర్ కే పరిమితమైంది. తనకు పాత్ర పరిధి మేరకు బాగానే చేసింది. గ్లామర్ తోపాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న అమ్ములు పాత్రను శృతి హసన్ అతిధి పాత్ర రూపంలో దక్కించుకుంది. ద్వితీయార్ధంలో అమ్ములు పాత్ర సినిమాకు కొంత బలాన్ని ఇచ్చింది. హంస నందిని క్లైమాక్స్ లో పాటలో మెరుపులా కనిపించినా.. అంత ప్రాధాన్యత ఉన్న పాత్రేమి కాదు. సినిమా తొలి భాగంలో విద్యుల్లేఖ రామన్ (ఎటో వెళ్లి పోయింది మనసు ఫేం) కామెడి ఆకట్టుకోలేకపోయింది. రావు రమేశ్, రవి శంకర్, కోట శ్రీనివాస్ రావు ఓకే అనిపించారు. చాలా కాలం తర్వాత తెలుగు తెరపై ఓ మోడ్రన్ పాత్రలో  రోహిణి హట్టంగడి కనిపించింది. 
 
శ్రీ మణి రాసిన 'పండగ చేస్కో', 'కుర్ర ఈడు', 'ఇది రణరంగం' బాగా ఉన్నాయి. అనంత శ్రీరాం రచించిన 'జాబిల్లి', 'ఓ లైలా'(భాస్కరభట్ల), 'నేను ఎపుడైనా' లాంటి సాహిత్య విలువలున్న పాటలకు తమన్ అందించిన స్వరాలు ప్రేక్షకుల్ని ఆలరించాయి. చోటా కే నాయుడు సినిమాటోగ్రఫి పర్వాలేదనిపించింది. 
 
ఇక 'ట్రెండ్ ఫాలోకాను.. క్రియేట్ చేస్తాను' అంటూ గబ్బర్ సింగ్ లో అదరగొట్టిన దర్శకుడు హరీష్ శంకర్ .. రామయ్యా వస్తావయ్యా లాంటి మూస కథను ఎందుకు ఎంచుకున్నాడో అర్ధం కాదు. ఎప్పుడో 80 దశకాల్లో వర్కవుట్ అయ్యే కథ ప్రస్తుత ట్రెండ్ కు ఎలా సరిపోతుందనేది అర్ధం కాని విషయం. పగ, ప్రతీకారం ఎలిమెంట్స్ తో ప్రేక్షకులతోపాటు, సినిమాని కూడా నలిపేశాడు. గబ్బర్ సింగ్ కు ముందు యావరేజ్ దర్శకుడిగా బ్రాండ్ ఉన్న హరీష్... తన రేంజ్ అదేనని ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడా అనిపించింది. ఎన్టీఆర్ ఎనర్జీ, సమంత, శృతి హసన్ గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్, మంచి సంగీతాన్ని అందించిన తమన్ కృషిని, ప్రముఖ నటి రోహిణి హట్టంగడి ప్రతిభను వినియోగించుకోవడంలో హరీష్ శంకర్  పూర్తిగా విఫలమయ్యాడు. వైవిధ్యంలేని కథను ఎంచుకున్న హరీష్ .. తన కథనంతో ప్రేక్షకుడ్ని విసిగించాడు. 
 
మంచి చిత్రాన్ని రూపొందించడానికి పూర్తి స్వేచ్చను ఇచ్చామని చెప్పిన దిల్ రాజు.. కాస్తా కంట్రోల్ చేసి ఉంటే దసరా సెంటిమెంట్ ఖచ్చితంగా వర్కవుట్ అయ్యుండేది. 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం విజయం సాధిస్తే ఎన్టీఆర్, సమంత, శృతి హసన్, తమన్ లకు ఆ క్రిడెట్ దక్కుతుంది. ఒకవేళ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతే దర్శకుడిగా హరీష్ శంకర్ కారణమని చెప్పవచ్చు.  ఏది ఏమైనా భారీ అంచనాలతో థియేటర్ కు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ లకు అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఊహించని నిరాశే ఎదురవ్వడం  ఖాయం.
-రాజబాబు అనుముల
a.rajababu@sakshi.com
 
 
 

For the latest stories, you can like Sakshi News on Facebook and also follow us on Twitter. Get the Sakshi News app for Android or iOS