బ్రూస్ లీ vs బ్రూస్ లీ

15 Oct, 2015 08:58 IST|Sakshi
బ్రూస్ లీ vs బ్రూస్ లీ

టాలీవుడ్లో సినిమాలకు టైటిల్ సమస్య చాలా కామన్. అయితే ఇలా వివాదాలు వచ్చిన సమయంలో పెద్దలు జోక్యం చేసుకొని సర్దుబాటు చేయటం, లేదా.. ఎవరో ఒకరు వెనక్కి తగ్గి టైటిల్ మార్చుకోవటం జరుగుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం రామ్చరణ్ లాంటి టాప్ స్టార్కే ఈ సమస్య ఎదురైంది. పోటీకి వచ్చింది కూడా వాళ్లూ వీళ్లూ కారు. ఎవరి మాట వినని సీతయ్య లాంటి రామ్గోపాల్ వర్మ కావటంతో చెర్రీ కూడా చేసేది లేక తన సినిమాను ట్యాగ్ లైన్ తో కలిపి ప్రమోట్ చేసుకుంటున్నాడు.

'గోవిందుడు అందరివాడేలే' సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న చెర్రీ.. ఇప్పుడు శ్రీను వైట్ల డైరెక్షన్ లో 'బ్రూస్ లీ' సినిమా చేశాడు. మాస్ ను అలరించే యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా పర్ఫెక్ట్ గా ఉన్న ఈ సినిమా చెర్రీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. సినిమా ప్రమోషన్ స్పీడు పెంచే సమయానికి అదే పేరుతో మరో సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తొలి భారతీయ మార్షల్ ఆర్ట్ చిత్రం అంటూ 'బ్రూస్ లీ' టీజర్ రిలీజ్ అయ్యింది. అందమైన అమ్మాయితో మార్షల్ ఆర్ట్స్ ఫైటింగులు చేయిస్తూ.. తనదైన శైలిలో టీజ్ చేస్తున్నాడు వర్మ.

దీంతో ఆలోచనలో పడ్డ రామ్ చరణ్ బ్రూస్ లీ టీం తమ సినిమాను 'బ్రూస్ లీ ది ఫైటర్' పేరుతో ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటివరకు తన ట్వీట్ లతో స్టార్ హీరోలను ఇబ్బంది పెట్టే వర్మ.. ఈ సారి ఏకంగా సినిమాతోనే ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఇలాంటివేవీ పట్టించుకొని వర్మ ఇప్పటికే టీజర్ తో పాటు వీడియో సాంగ్ ను కూడా రిలీజ్ చేశాడు. అయితే వర్మ తన సినిమా రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

చరణ్ కి ఈ సమస్య తెలుగులోనే కాదు, తమిళ ఇండస్ట్రీలో కూడా తప్పటం లేదు. జివి ప్రకాష్ హీరోగా తమిళ్ లో రూపొందుతున్న ఓ సినిమాకు 'బ్రూస్ లీ' అనే టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేశారు. దీంతో చేసేదేమీ లేక చరణ్ తమిళ్ వర్షన్ కు 'బ్రూస్ లీ2' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు, ఇలా ఒకే  పేరుతో ఒకే సమయంలో మూడు సినిమాలు సందడి చేయటం బహుశా భారతీయ సినిమా చరిత్రలోనే ఇదే తొలిసారి.