ఇలాంటి సినిమాలు అవసరం : వర్మ

25 May, 2016 14:24 IST|Sakshi
ఇలాంటి సినిమాలు అవసరం : వర్మ

'నాకు నచ్చిందే నేను తీస్తాను, మీకు ఇష్టమైతేనే నా సినిమా చూడండి' అంటూ మొండిగా వాదించే దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ, తన తదుపరి సినిమా విషయంలో మాత్రం కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తాను వీరప్పన్ సినిమా ఎందుకు తీశాడో తన ట్వీట్ల ద్వారా వివరించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు ఇలాంటి క్రిమినల్స్ జీవితం గురించి తెలుసుకోవటం అవసరం అంటూ సందేశం ఇస్తున్నాడు.

'వీరప్పన్ లాంటి క్రిమినల్స్ గురించి తెలుసుకోవటం అవసరం, ఎందుకంటే ఇలాంటి వాళ్లను ఎలా అంతమొందించాలో తెలిసినప్పుడే సమాజంలో ప్రగతి సాధ్యమవుతుంది. వీరప్పన్ తీయటంలో దుర్మార్గులను గొప్పగా చూపించే ఉద్దేశం లేదు. అతడు ఆ స్థాయికి ఎలా వచ్చాడో తెలియజేసే ప్రయత్నం మాత్రమే. వీరప్పన్ కథ ఓ సామాన్యుడు ప్రస్తుత వ్యవస్థను ఎలా మలుపు తిప్పగలడో తెలియజేసే నిదర్శనం. వీరప్పన్, రజనీకాంత్ను కిడ్నాప్ చేయాలనుకోవటం ఆసక్తికరమైన విషయమేం కాదు, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ను కిడ్నాప్ చేసిన వీరప్పన్కు సాధారణంగానే నెక్ట్స్ టార్గెట్ రజనీకాంత్'. అంటూ ట్వీట్ చేశాడు.

ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకున్న వీరప్పన్.. హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 27న రిలీజ్కు రెడీ అవుతోంది. తమిళనాట ఈ సినిమా రిలీజ్కు అడ్డంకులు ఎదురుకావచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వర్మ వివరణ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. కన్నడ, తెలుగు భాషలో మంచి విజయం సాధించిన వీరప్పన్ బాలీవుడ్లో కూడా సక్సెస్ సాధిస్తుండన్న నమ్మకంతో ఉన్నాడు వర్మ.