తిట్టించుకోకపోతే నాకు నిద్ర పట్టదు!

28 Nov, 2019 00:35 IST|Sakshi
రామ్‌గోపాల్‌ వర్మ

‘‘బయట, సోషల్‌ మీడియాలో నాపై భిన్నమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి నాకు బాగా తిట్టించుకోకపోతే నిద్రపట్టదు. నాలో అలాంటి బుద్ధి ఒకటి డెవలప్‌ అయ్యింది. ఎవరైనా పొగిడితే నాకు నిద్ర వస్తుంది’’ అన్నారు రామ్‌గోపాల్‌ వర్మ. టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై రామ్‌గోపాల్‌ వర్మ అందిస్తున్న చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. ఈ సినిమా రేపు విడుదల కానున్న సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ చెప్పిన విశేషాలు.

► నా కెరీర్‌లో నేను తీసిన తొలి సందేశాత్మక చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిగారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి పరిస్థితుల నుంచి ఈ సినిమా ఆలోచన వచ్చింది. 2019 మే 22 నుంచి సెప్టెంబరు 2020 కాలపరిమితిలో సినిమా ఉంటుంది. అంటే జరిగినవి, జరుగుతున్నవి తీయడంతో పాటు జరగబోయేవి కూడా ఊహించి తీసిన చిత్రం. రాజకీయ వ్యంగ్యంగా ఈ సినిమా ఉంటుంది. మారుతున్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ సిరీస్‌ను కంటిన్యూ చేయవచ్చేమో!

► ఈ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి పాత్ర వేయడానికి ఒకరు అవసరం అయ్యారు. ఆ  పాత్ర కోసం ఆర్టిస్టును వెతుకుతున్నప్పుడు ఓ వ్యక్తిని నేను సోషల్‌ మీడియాలో చూశాను. నాసిక్‌లో వెయిటర్‌గా చేస్తున్నాడని తెలిసింది. అతన్ని పిలిపించి నటనలో శిక్షణ ఇప్పించాం.

► ఈ సినిమాలో ఏ వర్గం వారినీ హైలైట్‌ చేయలేదు. టార్గెట్‌ చేయలేదు. కొన్ని రియల్‌æలైఫ్‌ క్యారెక్టర్స్‌ను పోలి ఉన్న ఆర్టిస్టులను సినిమాలో తీసుకోవడం జరిగింది. దీంతో ఆడియన్స్‌ వారి ఆలోచనకు తగ్గట్లు ఊహించుకుంటున్నారు. అంతే కానీ నేను ఎవర్నీ టార్గెట్‌ చేయలేదు.

► ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని ఎన్టీఆర్‌కు అంకితం ఇచ్చాం. ‘కమ్మ రాజ్యంలో...’ని ప్రఖ్యాతిగాంచిన ఇద్దరు తండ్రీకొడుకులకు అంకితమివ్వాలనుకుంటున్నాను. ఈ సినిమా ఐడియా మాత్రమే నాది. టీమ్‌ అంతా కలిసి తీశాం. సెన్సార్‌ నుంచి టైటిల్‌పై  అభ్యంతరం ఎదురైతే ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అనే టైటిల్‌ అనుకుంటున్నాం.

► ఇప్పుడు గ్యాంగ్‌స్టర్, క్రిమినల్‌ కథల కన్నా పొలిటికల్‌ క్రిమినల్‌ స్టోరీసే ఆసక్తికరంగా ఉంటున్నాయి. మా కంపెనీ నుంచి రానున్న మరో చిత్రం ‘బ్యూటీఫుల్‌’ వచ్చే నెల 6న విడుదలవుతుంది. ఓ చైనీస్‌ కో–ప్రొడక్షన్‌ కంపెనీతో ఢలేడీ బ్రూస్‌లీ’ సినిమా తీస్తున్నాం. నేను భక్తి సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఒప్పుకోరేమో!.

►  ట్రైలర్‌లో పప్పు వడ్డించే సీన్‌ ఉంది? అభ్యంతరం తెలుపుతూ కాల్స్‌ వచ్చాయా?
నేను విన్నది ఏంటంటే ఈ సీన్‌ తెలుగు దేశంవారికి బాగా నచ్చిందట. అంటే తెలుగుదేశం వారు బయటకు చెప్పలేని విషయాన్ని నేను చెప్పినందుకు వారికి నచ్చిందేమో. ఆ సీన్‌ నచ్చిందని కొన్ని ఫోన్లు వచ్చాయి. అయినా ఓ తండ్రి తన కొడుక్కి ప్రేమగా పప్పు వడ్డిస్తాడు. ఈ సీన్‌ను ఏదోలా భావిస్తే నా తప్పు కాదు.

► ఈ టీజర్‌లో ‘బుడ్డోడు’ అనే డైలాగ్‌ ఉంది? ఇది ఒక యాక్టర్‌ గురించి అంటారా?
అది మీరు సినిమాలో చూడండి.

► కళ్లు పెద్దవి చేసి చూస్తే ఎవరూ భయపడరు? అని అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న వ్యాఖ్యలను అలాగే పెట్టారు..?
మనుషులు అన్నప్పుడు చూశారు. మరి ఇప్పుడు సినిమాలోని యాక్టర్‌ అంటే ప్రాబ్లమ్‌ ఏంటి? అల్రెడీ పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నదే కదా!

► ఈ సినిమా జగన్‌మోహన్‌రెడ్డిగారికి ఫేవరబుల్‌గా ఉంటుందని కొందరి అభిప్రాయం?
► అది కరెక్ట్‌ కాదు. జరగనిది ఊహించి ఒక భవిష్యత్‌ను తెరకెక్కించినప్పుడు ఎవరికీ ఫేవర్‌గా చూపించలేం. జరిగిన సంఘటనలు అయితే ఎవరు కరెక్ట్‌? ఎవరు కాదు? అని ఓ అంచనాతో ఉండొచ్చు. మరి జరగని దాని గురించి ఎలా ఫేవర్‌గా తీస్తారు?

► జనసేన ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది?
సినిమాలో పవన్‌కల్యాణ్‌ను పోలి ఉన్న ఓ వ్యక్తి మనసేన అనే పార్టీ పెడతారు. ఈ ‘మనసేన’ పార్టీకి, జనసేనకు ఏ సంబంధం లేదు.

► ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయ పరిస్థితుల ఆధారంగా సినిమా తీసే ఆలోచన ఏమైనా ఉందా?
మరో ‘సర్కార్‌’ తీయాలని ఉంది.

► ట్రైలర్‌లో స్పీకర్‌ నిద్రపోతున్నట్లు చూపించారు
నిజంగా జరిగి, పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్న దాని గురించి కామెంట్‌ చేయడానికి ఎవరికైనా హక్కు ఉంటుందని నా అభిప్రాయం. అందరికీ తెలిసిన దాన్నే నేను సినిమాలో చూపించాను.

మరిన్ని వార్తలు