సత్యమే గెలిచింది.. జై ఎన్టీఆర్‌ : వర్మ

18 Feb, 2019 11:29 IST|Sakshi

సాధారణంగా బయోపిక్‌ అంటే, జీవితంలోని అన్ని విషయాలూ కాకపోయినా ముఖ్యమైన విషయాల్ని తెరకెక్కించాల్సి ఉంటుంది. అయితే స్వర్గీయ ఎన్టీఆర్‌పై ఏకకాలంలో బయోపిక్‌లు వస్తుండటంతో వీటిల్లో ఏది యధార్థానికి దగ్గరగా ఉంటుంది అనే విషయంపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చసాగుతోంది. సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన లక్ష్మీస్‌ ఎన్టీఆర్, ఎన్టీఆర్‌పై వస్తున్న మరో చిత్రం మహానాయకుడులో నిజాయితీతో తీసిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఏదంటూ వర్మ ట్విట్టర్‌లో పోల్‌ నిర్వహించారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లలో ఏది నిజాయితీతో, యధార్థ సంఘటనలకు దగ్గరగా ఉన్న చిత్రం అంటూ వర్మపెట్టిన పోల్‌కు నెటిజన్లు భారీగా స్పందించారు. వర్మ పోల్‌కు 41, 734 ఓట్లు రాగా, అందులో 85 శాతం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు ఓటు వేయగా, కేవలం 15 శాతం నెటిజన్లు మాత్రమే మహానాయకుడుకు బాసటగా నిలిచారు. ఈ పోల్‌ రిజల్ట్‌ను పోస్ట్‌ చేస్తూ సత్యమే గెలిచింది.. జై ఎన్టీఆర్‌ అంటూ వర్మ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్ మార్చి మొదటి వారంలో విడుదల కానుంది.


ఇక ఇప్పటికే వచ్చిన కథా నాయకుడు రిలీజ్ తర్వాత... అది వాస్తవాలకు దూరంగా ఉందని భావించిన ప్రజలు వర్మ మూవీ కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు. మహానాయకుడులో వెన్నుపోటు ఎపిసోడ్‌ని మేనేజ్‌ చేసి ఉంటారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఎన్టీఆర్‌ జీవితంలోని అతి ముఖ్యమైన ఆ భాగం చూపించకపోతే, అదసలు అన్నగారి చరిత్రే కాదనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో ఓ ఎజెండాతో అసలు విషయాన్ని పక్కన పెట్టినట్టు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు