నాకు హీరోలకన్నా విలన్స్‌ అంటేనే ఇష్టం

4 Feb, 2020 00:16 IST|Sakshi
జీవా, రామ్‌గోపాల్‌ వర్మ, నట్టి క్రాంతి, శివ బాలాజీ, మధుమిత, నట్టి కరుణ, నట్టి కుమార్‌

– రామ్‌గోపాల్‌ వర్మ

‘‘స్టాలిన్‌ అనేది నా ఫేవరెట్‌ పేరు. స్టాలిన్‌ రష్యన్‌ నియంత. ‘స్టాలిన్‌’ పేరుతో చిరంజీవిగారు సినిమా చేశారు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ‘స్టాలిన్‌’ అనే పేరుని వింటున్నాను. ఈ  చిత్రం టైలర్‌ చాలా బావుంది’’ అని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. జీవా, రియా సుమన్, నవదీప్‌ ముఖ్య పాత్రల్లో రతిన శివ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సీరు’. తెలుగులో ‘స్టాలిన్‌’ టైటిల్‌తో వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్, నట్టిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, క్విట్టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ – ‘‘జీవా చాలా ఈజ్‌తో నటించాడు. ఇందులో నవదీప్‌ లుక్‌ (నవదీప్‌ది విలన్‌ పాత్ర) విభిన్నంగా కనిపిస్తోంది. నాకు హీరోలకన్నా విలన్స్‌ అంటేనే ఇష్టం. దర్శకుడు సినిమాను బాగా హ్యాండిల్‌ చేశారు’’ అన్నారు. ‘‘జీవా తండ్రి ఆర్‌.బి. చౌదరిగారి బ్యానర్‌లో రాజశేఖర్‌గారు సింహరాశి, గోరింటాకు వంటి పెద్ద హిట్‌ సినిమాలు చేశారు. వాళ్ల నాన్నగారి పేరు నిలబెట్టాలని జీవా మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ‘రంగం’ కంటే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్‌ అవ్వాలి’’ అన్నారు జీవితా రాజశేఖర్‌.

‘‘మొదటి నుంచి తెలుగు ప్రేక్షకులతో నాకు మంచి అనుబంధం ఉంది. నన్ను ‘రంగం’ నుంచి సపోర్ట్‌ చేస్తూ వస్తున్నారు. వర్మగారి సినిమాలంటే నాకు ఇష్టం. ఆయన దగ్గర డైరెక్షన్‌ నేర్చుకోవాలని అనుకున్నాను. త్వరలో స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేయాలనుకుంటున్నాను’’ అన్నారు జీవా. ‘‘తెలుగు ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కథ రాశాను. మంచి సందేశం ఇవ్వబోతున్నాం’’ అన్నారు రతిన శివ.  ‘‘తెలుగు ప్రేక్షకులకు తెలుగు, తమిళం అనే భేదాలు ఉండవు.

అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తారు. తొలిసారి ఇందులో పూర్తి స్థాయి విలన్‌ పాత్రలో నటించాను’’ అన్నారు నవదీప్‌. ‘‘నట్టి ఫ్యామిలీకి ఈ సినిమా మంచి విజయం తీసుకురావాలి’’ అన్నారు టి. అంజయ్య. ‘‘మంచి పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు నట్టికుమార్‌. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ రియా సుమన్, నిర్మాతలు దామోదర ప్రసాద్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, వేల్స్‌ శ్రవణ్, శివ బాలాజీ, మధుమిత పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు