హాయిగా.. ఖాళీటైమ్‌

16 May, 2020 08:01 IST|Sakshi

 కరోనా కష్టాలు చూస్తే బాధేస్తోంది

రెండు నెలలుగా గుమ్మం దాటలేదు  

‘సాక్షి’తో సినీ నటి రమ్యకృష్ణ

‘పరుగులు లేవు. మేకప్‌ లూ.. పేకప్‌లూ లేవు. అరుపులూ.. హడావుడీ లేదు. పొల్యూషన్‌ లేదు. చుట్టూ నిశ్శబ్ధమే.. కుటుంబంతో మమేకమే’ అంటున్నారు సినీ నటి ఎవర్‌ గ్రీన్‌ గ్లామర్‌ హీరోయిన్‌ రమ్యకృష్ణ. టాలీవుడ్‌ అగ్రగామి హీరోయిన్‌గా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కూడారాణించి.. బాహుబలి సినిమా తర్వాత మరిన్ని ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ స్టార్‌ యాక్ట్రెస్‌ గతేడాదే వెబ్‌సిరీస్‌లో కూడా నటించారు. క్వీన్‌ పేరుతో రూపొందిన ఆ వెబ్‌సిరీస్‌ తెలుగులో డబ్‌ అయి జీ తెలుగు చానెల్‌లో ప్రసారం కానుంది. ఒక వెబ్‌సిరీస్‌ తెలుగు టీవీ చానెల్‌లో ప్రసారం అవుతుండటం కూడా ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రమ్యకృష్ణ
‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

సినిమాల్లో బిజీ బిజీ..
ప్రస్తుతం కృష్ణవంశీ తీస్తున్న రంగమార్తాండ, పూరి జగన్నాథ్‌ విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం, సాయిధరమ్‌ తేజ్‌ సినిమా.. ఇలా పలు చిత్రాల్లో నటిస్తున్నా. క్వీన్‌ సీజన్‌–2 కూడా చేయాలి. ఓ ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్, రెండు హిందీ ప్రాజెక్టŠస్‌ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూడాలి లాక్‌డౌన్‌ తర్వాత ఏమవుతుందో..? నాకు డ్రీమ్‌ రోల్‌ అంటూ ఏవీ ఉండవు. నాకొచ్చిన, వస్తున్నవన్నీ నేను కోరుకున్నవే అన్నట్టు ఉంటాయి. కాబట్టి అవే నా డ్రీమ్‌ రోల్స్‌ అనుకోవచ్చు(నవ్వుతూ)..లాక్‌డౌన్‌ నా జీవితంలో ముందెన్నడూ ఎరుగని అనుభవాన్ని ఇచ్చింది. హాయిగా ఉంది. ఇలాంటి టైమ్‌ లైఫ్‌లో దొరకలేదు. ఇలాంటి టైమ్‌ మళ్లీ దొరకదేమో కూడా.. దాదాపు రెండు నెలలైందేమో గుమ్మం దాటి. ఓ వైపు టైమంతా మన చేతుల్లోకి రావడం, ఫ్యామిలీతో మరింత టైమ్‌ స్పెండ్‌ చేయడం చాలా బాగున్నా.. మరోవైపు ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతుండటం, మన దేశంలో వలస కూలీలు, ఆహారం లేని నిరుపేదల దుస్థితి చూస్తుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తోంది. వాళ్లంతా తమ తమ ఊర్లకు వెళ్లి.. బాగుండాలని కోరుకుంటున్నాను.

‘క్వీన్‌’ను ఆమెతో పోలుస్తున్నారు..
నేను నటించిన తొలి వెబ్‌సిరీస్‌ క్వీన్‌. దీని డైరెక్టర్‌ గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ చాలా ప్రజ్ఞావంతులు. ఆయన స్ట్రాంగ్‌ స్క్రిప్‌తో వస్తారు. చాలా బాగా తీస్తారని తెలుసు. ఈ అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? అందుకే చేశా. ఇక ఇందులో నా పాత్ర జయలలితను పోలినట్టు ఉందని అంటున్నారు. అది ఎవరికి తోచినట్టు వారు పోల్చుకోవచ్చు.. దానికి నేనేం చేయలేను. అనితా శివకుమారన్‌ రాసిన క్వీన్‌ నవల ఆధారంగా తీసిన చిత్రమిది. ఇది తెలుగు ప్రేక్షకులకు కూడా జీ తెలుగు చానెల్‌లో వచ్చే సోమవారం నుంచి సీరియల్‌గా అందిస్తుండటం నాకు మరింత ఆనందంగా అనిపిస్తోంది. క్వీన్‌ సినిమా చేయడం ద్వారా రాజకీయ ఆకాంక్షలు, ఆలోచనలు ఏమీ రాలేదు. వస్తాయా? అంటే భవిష్యత్‌లో ఏమవుతుందీ చెప్పలేం కదా..

ఒత్తిడి వద్దు.. జాగ్రత్తలు వీడొద్దు.. 
రేపేమవుతుంది? రేపేం కాదు? అనేది తెలియడం లేదు. కంటికి కనపడని శత్రువుతో చేసే యుద్ధం కాబట్టి మానసిక ప్రశాంతతను కొంత కోల్పోతాం. ఇది మనల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. కరోనాతో మనం కలిసి బతకాల్సిందే అంటున్నారు. కాబట్టి బీ స్ట్రాంగ్, భయం, ఒత్తిడి మనల్ని తమ ఆధీనంలోకి తీసుకోకుండా పాజిటివ్‌ థింకింగ్‌ పెంచుకోవాలి.. జాగ్రత్తలు పాటించండి. ఒకసారి ఈ లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత ఈ టైమ్‌ తప్పకుండా మెమొరబుల్‌ అవుతుంది. ఇలాంటి ఫ్రీ టైమ్‌ మళ్లీ వస్తుందా? అనిపిస్తుంది. కానీ మళ్లీ వచ్చినా ఇలాంటి కరోనా లాంటి కారణంతో కాకుండా రావాలని మాత్రం కోరుకుంటున్నా. 

ప్రేక్షకుల హృదయాల్లో వెబ్‌.. డబ్‌
ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ కోసం చాలా వైవిధ్యభరితమైన ఆసక్తికరమైన కథాంశాలు ఎంచుకుంటున్నారు. దీని వల్ల  నటులకు వెరైటీ రోల్స్‌ చేసే అవకాశం లభిస్తుంది. ఈ కరోనా దెబ్బకు వెబ్‌సిరీస్‌కి మరీ డిమాండ్‌ బాగా పెరిగింది. అయితే సినిమాలు చూడటం కోసం థియేటర్స్‌కి జనం వెళ్లడం మానేస్తారు అనను గానీ వెబ్‌సిరీస్‌ కూడా అదేస్థాయిలో ఆదరణ వస్తుందని చెప్పగలను. ఇకపై కూడా వెబ్‌సిరీస్‌లో నటిస్తాను. తెలుగులో చిరంజీవిలాంటి అగ్రనటులు కూడా వెబ్‌సిరీస్‌లో నటిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారితో కాంబినేషన్‌గా నాకు ఏదైనా మంచి ఛాన్స్‌ వస్తే తప్పకుండా చేస్తాను. ఇంటర్నేషనల్‌ వెబ్‌ సిరీస్‌ ఆఫర్లున్నాయి. వెబ్‌సిరీస్‌లో సాంగ్స్‌ ఉండవు నిజమే.. అయినా నేనిప్పుడేం సాంగ్స్‌ చేస్తాను చెప్పండి?(నవ్వుతూ).. సాంగ్స్‌కంటే వెబ్‌సిరీస్‌లో కంటెంటే పెద్ద ఆకర్షణ. 

మరిన్ని వార్తలు