ప్రభాస్‌ కంటే ముందే రానా పెళ్లి?

10 Dec, 2018 04:32 IST|Sakshi
ప్రభాస్, కరణ్‌ జోహార్, రానా, రాజమౌళి

టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ లిస్ట్‌లో హీరోలు ప్రభాస్, రానా ముందు వరసలో ఉంటారు. మరి.. వీరిద్దరిలో ఎవరు ముందు పెళ్లి చేసుకుంటారు? అనే ప్రశ్నకు సమాధానం దర్శకుడు రాజమౌళి చెప్పారట. ఎక్కడంటే... ముంబైలో దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా చేసిన ‘కాఫీ విత్‌ కరణ్‌’ టీవీ షోలో. ‘బాహుబలి’ చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళికి మంచి పేరు ప్రతిష్టలు దక్కాయి.

ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్‌ స్టార్‌డమ్‌ అంతర్జాతీయ స్థాయిని టచ్‌ చేస్తే, ప్రధాన పాత్రలు చేసిన రానా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, అనుష్క, తమన్నాల నటనకు సినీ లోకం ఫిదా అయ్యింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు ఐదేళ్ల ‘బాహుబలి’ ప్రయాణం తర్వాత రాజమౌళి, ప్రభాస్, రానా ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో కోసం ఒకే వేదికపైకి వచ్చారు. త్వరలో ఈ ఎపిసోడ్‌ ప్రసారం కానుందట. ఈ షోలో రాజమౌళి, ప్రభాస్, రానా ‘బాహుబలి’ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారట.

అలాగే ప్రభాస్, రానాల పెళ్లి గురించి కరణ్‌ ప్రశ్నించినప్పుడు రాజమౌళి కలుగజేసుకుని ప్రభాస్‌ కంటే ముందే రానా పెళ్లి పీటలు ఎక్కుతారని చెప్పారని షోను ఫాలో అయిన బాలీవుడ్‌ సినీవాసులు అంటున్నారట. అలాగే ‘నేను చాలా బద్ధకస్తుడ్ని. అదే నా పెద్ద బలహీనత’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రభాస్‌ చెప్పారట. బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్‌ను సాధించిన టాప్‌ 5 సినిమాల్లో ‘బాహుబలి’ ఉంటుంది. అలాగే ‘బాహుబలి’ సినిమాను హిందీలో కరణ్‌ జోహార్‌ డిస్ట్రిబ్యూట్‌ చేశారన్న విషయం తెలిసిందే.
 

>
మరిన్ని వార్తలు