వాళ్ల సంతోషమే మా సంతోషం

9 Jul, 2018 00:30 IST|Sakshi
నవీన్‌ యర్నేని, సుకుమార్, రామ్‌చరణ్, దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు, మోహన్‌ చెరుకూరి, రవిశంకర్, మోనికా, రామకృష్ణ

రామ్‌చరణ్‌

‘‘ఈ సినిమా సక్సెస్‌ ఒక వ్యక్తి ఆలోచన. సుకుమార్‌ ఆలోచన నుంచే మొదలైంది. మంచి కథను తయారు చేసి మాతో యాక్ట్‌ చేయించింది. ఇది సుకుమార్‌గారి డ్రీమ్‌. ఆయన ఆలోచన స్థాయి వంద రోజుల వరకు తీసుకువచ్చింది. సుకుమార్‌గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్యూ సుకుమార్‌గారు’’ అని రామ్‌చరణ్‌ అన్నారు. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగస్థలం’. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యర్నేని, మోహన్‌ చెరుకూరి, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం 100 రోజుల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ వేడుకలో చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు, వంద రోజులు కంప్లీట్‌ చేసుకున్న థియేటర్స్‌ ఓనర్స్‌ అందరికీ  100 డేస్‌ షీల్డ్‌ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ – ‘‘సినిమా 100 రోజులు ఆడిందంటే దాని వెనక ఎంతో మంది కృషి, శ్రమ, ప్రయత్నం ఉన్నాయి. నేను వర్క్‌ చేసిన నిర్మాతల్లో మైత్రీ వాళ్లు మోస్ట్‌ లవబుల్‌. రత్నవేలు గారితో నా అనుబంధం ‘ఖైదీ నంబర్‌ 150’ నుంచి స్టార్ట్‌ అయింది. ‘సైరా’ కూడా ఆయనే చేస్తున్నారు.

దేవి గురించి కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. రాక్‌స్టార్‌. నీ (దేవిని ఉద్దేశించి) పాటలతో మా కొరియోగ్రాఫర్స్‌ని నేను కష్టపెడుతూనే ఉంటాను. నేను చేయను అని చిన్నపిల్లాడిలా వెళ్ళిపోతాను. రంగమ్మ అత్తలా చేసిన అనసూయకు కూడా థ్యాంక్స్‌. ఆది, సమంత, జగపతిబాబు, ప్రకాష్‌ రాజ్‌ అందరికీ థ్యాంక్స్‌. మనం నేర్చుకునే పెద్ద విషయం అయినా చిన్న విషయం అయినా గురువుల నుంచి లేదా తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాం. వాళ్లని గుర్తు చేసుకోకుండా ఉండలేం.

నాన్నగారిని గుర్తు చేసుకోవాలని అనుకోలేదు కానీ నాన్నగారిని అబ్జర్వ్‌ చేస్తుండగా ఒక మనిషికి ఎందుకు ఇంత ఆదరణ, ప్రేమ లభిస్తాయి అని గమనించాను. కేవలం మంచి సినిమాల వల్ల, గొప్ప పాత్రల వల్లే కాదు. ఆయన ఒకటే చెప్పారు. ‘మనం ఎదిగేటప్పుడు మనతో పాటు ఓ పది మందిని పైకి తీసుకురావాలని. ఎందుకంటే ఒకవేళ మనం పడిపోతే ఆ పది మందే మనల్ని కాపాడతారు’. మా ఇండస్ట్రీని, మమల్ని కాపాడేవాళ్లు మా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌. వాళ్లు సంతోషంగా ఉంటే మేమందరం సంతోషంగా ఉంటాం.

మా సినిమానే కాదు రేపు వచ్చే అన్ని సినిమాలు ఇలానే మంచి మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సుక్కూకి థ్యాంక్స్‌’’ అన్నారు. సుకుమార్‌ మాట్లాడుతూ  – ‘‘రంగస్థలం’ చిట్టిబాబు మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఏమీ ఉండదు. మళ్లీ మళ్లీ చెబుతున్నాను అని కాదు కానీ.. ‘నువ్వు (రామ్‌   చరణ్‌ని ఉద్దేశించి) ఓకే అనకపోతే ఈ కథ ఉండేది కాదు. నేను ఇంకో కథతో రెడీగా ఉన్నా. ఆ కథ చేసేవాడిని. సో ‘రంగస్థలం’ జరగడానికి మూలకారకుడివి నువ్వే. థ్యాంక్స్‌ డార్లింగ్‌’. నవీన్‌గారు, రవిగారు, మోహన్‌గారు చాలా మంచి నిర్మాతలు. ఈ సినిమా సక్సెస్‌ గురించి నాకు చెబుతూనే ఉన్నారు.

ఇంత మంచి ప్రాజెక్ట్‌ చేయడానికి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్‌. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ చెర్రీగారు చాలా కష్టపడ్డారు. యుగంధర్, సతీష్‌గారికి థ్యాంక్స్‌. రత్నవేలు మంచి విజువల్స్‌ తీశారు. మై సోల్‌ దేవికి థ్యాంక్స్‌. రామ్‌చరణ్‌గారితో మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని ఉంది. లేకపోతే మళ్లీ నీకు, నాకు చాలా దూరం వస్తుందేమో.(ఎప్పుడెప్పుడూ ఏంటీ... తొందరగా చెప్పు.. మైక్‌ అందుకున్న చరణ్‌ సరదాగా నవ్వులు)’’ అన్నారు. నవీన్‌ యర్నేని మాట్లాడుతూ– ‘‘వంద అనేది ఈ రోజుల్లో ఉందా? అలాంటి వంద రోజుల చిత్రాన్ని మాకు ఇచ్చిన చరణ్‌గారికి, సుకుమార్‌గారికి, మా సినిమాకు పని చేసిన సభ్యులందరికీ థ్యాంక్స్‌. మా లైఫ్‌లో గుర్తుండిపోయే మూమెంట్‌ ఇది. ‘రంగస్థలం’ ఈజ్‌ మిరాకిల్‌’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, రత్నవేలు, దేవిశ్రీ ప్రసాద్, అనసూయ, బ్రహ్మాజీ,  కొరియోగ్రాఫర్స్‌ జానీ, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు