రంగస్థలం.. ఆ లొల్లి లేనట్లే!

2 Apr, 2018 17:36 IST|Sakshi

రంగస్థలం బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో మెగా ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఈ ఏడాది బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ సాధించిన తొలి చిత్రం కావటంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఓ అంశం వారిని కలవరపెడుతోంది కూడా. అదే ఈ చిత్రం డిజిటల్‌ రైట్స్‌ వ్యవహారం. 

ఈ మధ్య సినిమాల డిజిటల్‌ హక్కులను దక్కించుకుంటున్న అమెజాన్‌ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి సంస్థలు.. నెల రోజులు తిరగకుండానే సినిమాలను తమ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేస్తున్నాయి. రంగస్థలం చిత్రం కోసం కూడా భారీగా వెచ్చించి (సుమారు రూ.18 కోట్లు అని చెబుతున్నారు) అమెజాన్‌ ప్రైమ్‌ హక్కులను దక్కించుకుంది. దీంతో చిత్రం హిట్‌ టాక్‌ వచ్చినప్పటికీ.. 50 రోజులు తిరగకుండానే డిజిటల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుందేమోనని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నిర్మాతల క్లారిటీ... అయితే ఈ విషయంలో కంగారుపడాల్సిన అవసరం లేదని రంగస్థల చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ డిస్ట్రిబ్యూటర్లకు భరోసా ఇస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌తో  ‘50 రోజుల పూర్తయ్యాకే చిత్రం వినియోగదారులకు అందుబాటులోకి తేవాలి’ అన్న షరతు మేరకే ఒప్పందం చేసుకున్నట్లు నిర్మాతల్లో ఒకరైన నవీన్‌ యెర్నినేని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు