సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన రంగోలీ

7 Jun, 2019 16:38 IST|Sakshi

బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం (బంధుప్రీతి) మాఫియా కారణంగా దక్షిణాది యువ దర్శకులు కూడా భయపడుతున్నారని అంటున్నారు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సోదరి రంగోలి చందేల్‌. ప్రస్తుతం కంగన ‘మెంటల్‌ హై క్యా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సినిమాలోని కొన్ని సన్నివేశాలతో కంగన సంతృప్తి చెందలేదని, అందుకే దర్శకత్వ బాధ్యతలను తాను కూడా చూసుకోవాలనుకుంటున్నారని ప్రకాశ్‌ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.

దీనిపై ఓ ఆంగ్ల మీడియా సంస్థ ‘మరోసారి కంగన దర్శకత్వ బాధ్యతలను చేజిక్కించుకుంది’ అనే వార్తను ప్రచురించింది. ఈ వార్తపై కంగనా సోదరి రంగోలి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం మాఫియా కంగన కెరీర్‌ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది. అందుకే ఇలాంటి వార్తల ప్రచురణకు పాల్పడుతోంది. అసలు విషయం ఏంటంటే.. కొందరు దర్శకులు ఏమీ తెలియని స్టార్‌ కిడ్స్‌కి అన్నీ దగ్గరుండి నేర్పించాలని అనుకోరు. తమ వెంటే ఉండి అన్ని విషయాల్లో సాయం చేసే నటులు కూడా ఉంటే బాగుంటుందని అనుకునే దర్శకులు కూడా ఉంటారు. కంగన కొత్తగా వస్తున్న దర్శకులకు అవకాశాల తలుపులు తెరిచింది. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌(తను వెడ్స్‌ మను), వికాస్‌ బెహల్‌(క్వీన్‌) లాంటి దర్శకులకు ఆమె అవకాశం ఇచ్చింద’ని రంగోలి తెలిపారు.

అంతేకాక ‘యువ దర్శకులు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. అలా భయపడే దర్శకులకు ఇలాంటి వార్తలు పనికొస్తాయి’ అంటూ రంగోలి వరుస ట్వీట్లు చేశారు. అంతేకాక కంగనాను ఆలియా, దీపికా పదుకోనే వంటి హీరోయిన్లతో పోల్చవద్దని కోరారు. కంగనా ఏ స్టార్‌ హీరో, దర్శకుడి సాయం లేకుండా స్వయం కృషితో ఎదిగిందని రంగోలి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు