ఆన్ లైన్ లో సినిమా మొత్తం లీక్

27 Feb, 2017 15:46 IST|Sakshi
ఆన్ లైన్ లో సినిమా మొత్తం లీక్

ముంబయి: మరో సినిమా ఆన్ లైన్ పైరసీ బారిన పడింది. షారూఖ్‌ ఖాన్ 'రాయిస్', ఆమిర్‌ ఖాన్ 'దంగల్' ఇటీవల ఆన్ లైన్ లో లీక్ కాగా.. తాజాగా రంగూన్‌ సినిమాకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ సినిమా మొత్తాన్ని దుండగులు ఆన్ లైన్ లో పెట్టేశారు. ఈ నెల 24న రంగూన్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన వెంటనే ఈ సినిమా ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి లోనైంది. సినిమా మొత్తం ఆన్ లైన్ లో వచ్చేయడంతో ఆ ప్రభావం వసూళ్లపై పడనుంది.

భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లు అంతగా రాలేదు. ఇప్పుడు సినిమా మొత్తం ఇంటర్నెట్ లో వచ్చేయడంతో వసూళ్లు మరింత తగ్గే అవకాశముంది. పైరసీదారులను కనిపెట్టేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన 'రంగూన్‌'పై మంచి రివ్యూస్ వచ్చాయి. విలక్షణ దర్శకుడు విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సైప్‌ అలిఖాన్‌, షాహిద్ కపూర్, కంగనా రౌనత్ ముఖ్యపాత్రల్లో నటించారు.