ఎన్నో రంగులు

21 Oct, 2018 00:37 IST|Sakshi

సమాజంలో యువత బాధ్యత ఏంటి? సమాజాన్ని కాపాడాల్సిన పోలీసుల బాధ్యత ఏంటి? ఇలాంటి కథాంశంతో నల్లస్వామి సమర్పణలో యు అండ్‌ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తనీష్, ప్రియాసింగ్‌ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘రంగు’. కార్తికేయ.వి దర్శకత్వంలో ఎ. పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో రచయిత, నటులు పరుచూరి వెంకటేశ్వర రావు ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా  తనీష్‌ మాట్లాడుతూ– ‘‘నేను బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఉండగా మా ‘రంగు’ సినిమాకు సంబంధించిన ట్రైలర్, మూడు పాటలను విడుదల చేశారు. మంచి రెస్పాన్స్‌ వచ్చింది.  సినిమాలో నా పాత్ర విషయానికి వస్తే విజయవాడకి చెందిన లారా అనే కుర్రాడి పాత్ర పోషిస్తున్నాను. 17–28 సంవత్సరాల మధ్య ఉండే వ్యక్తిగా నాలుగు వేరియేషన్లలో నా పాత్ర ఉంటుంది. సోషల్‌ మెసేజ్‌ ఉన్న సినిమా’’ అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘న్యూస్‌ పేపర్‌లో ఓ విషయాన్ని చదివి నేరుగా అక్కడికి వెళ్లి లారా అనే వ్యక్తిని కలిసి తయారు చేసుకున్న కథ ఇది.

రియలిస్టిక్‌గా ఉంటూనే కమర్షియల్‌ పంథాలో ఎలా సినిమా చేయాలో పరుచూరి బ్రదర్స్‌ చెప్పారు. ఓ చిన్న కుర్రాడి పాత్ర నుండి ఇరవై ఎనిమిదేళ్ల యువకునిగా కనపడే పాత్ర కోసం తనీష్‌ ఎంతో కష్టపడ్డారు’’ అన్నారు. ఎ.పద్మనాభరెడ్డి మాట్లాడుతూ– ‘‘యు అండ్‌ మీ సంస్థను స్థాపించటం వెనక ్రçపధాన కారణం ఆశయాన్ని బతికించటం. కృష్ణానగర్‌లో ఎంతో మంది దర్శకులు వారి ఆకలిని మరిచిపోయి ఆశయం కోసం బతుకుతుంటారు. నిర్మాతలెందరో వస్తుంటారు, పోతుంటారు. కానీ ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా చనిపోయే దాకా నిర్మాతగానే ఉంటాను’’ అన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం: సిరివెన్నెల, సంగీతం: యోగేశ్వర శర్మ.

>
మరిన్ని వార్తలు