రాణీ ముఖర్జీ చిత్రానికి నో టాక్స్

25 Aug, 2014 16:08 IST|Sakshi
రాణీ ముఖర్జీ చిత్రానికి నో టాక్స్

భోపాల్:బాలీవుడ్ నటి రాణీముఖర్జీ నటించిన 'మర్దానీ' చిత్రం అరుదైన ఘనతను దక్కించుకుంది. సాధారణంగా ఎక్కడ ఏ చిత్రం విడుదలైనా పన్ను నిమిత్తం కొంత మొత్తాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంటాం. అయితే మర్దానీ చిత్రానికి ట్యాక్స్ ఫ్రీ హోదా కల్పించడానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సిద్ధమైయ్యారు. ఆ చిత్రాన్ని ఆదివారం రాత్రి  సతీ సమేతంగా వీక్షించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రంలో మహిళలు, టీనేజ్ బాలికలపై జరుగుతున్నఅరాచకాలకు సంబంధించి ఒక మంచి సందేశం ఉండటమే దీనికి ప్రధాన కారణం.

 

మర్దానీ చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఆయన ట్విట్టర్ లో రాణి ముఖర్జీ పాత్రపై ప్రశంసలు కురిపించారు. 'మర్దానీ లో ఆమె పోషించిన పాత్ర అద్భుతమైనదే కాకుండా చాలా శక్తివంతమైనదిగా ఉంది. ఈ చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రాకు ప్రత్యేక అభినందనలు. మంచి చిత్రాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చి సామాజిక చైతన్యం కల్గించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రానికి టాక్స్ ఫ్రీ హోదా కల్పిస్తాం' అని పేర్కొన్నారు. ఆయన బీజీ షెడ్యూల్లో ఉన్నా కూడా చాలాకాలం తరువాత ఆయన కుటుంబ సమేతంగా సినిమాను వీక్షించడం గమనార్హం.