అందుకే మా అమ్మను ట్రోల్‌ చేశారు: రణు కూతురు

30 Nov, 2019 08:31 IST|Sakshi

తన తల్లి సింగర్‌ మాత్రమే అని, మోడల్‌ కాదని సోషల్‌ మీడియా సెన్సేషన్‌ రణు మొండాల్‌ కూతురు ఎలిజబెత్‌ సతీరాయ్‌ అన్నారు. కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించి.. రణు చేత ర్యాంప్ వాక్‌ చేయిస్తూ ఆమెను నవ్వులపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రణు మొండాల్‌ తన అద్భుత గాత్రంతో దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌ పాటలను ఆలపిస్తూ ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె మధురమైన గానానికి ముగ్ధుడైన బాలీవుడ్‌ సంగీత దర్శకుడు హిమేశ్‌ రేష్మియా రణు చేత ఓ పాటను రికార్డు చేయించాడు. ఇక అప్పటి నుంచి రణుకు సెలబ్రిటీ హోదా దక్కింది. ఈ క్రమంలో పలు హిందీ టీవీ చానెళ్లు తమ కార్యాక్రమాలకు రణును ఆహ్వానించడంతో ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఓ బ్యూటీ పార్లర్‌ నిర్వాహకులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రణును అతిథిగా ఆహ్వానించారు. తమ పార్లర్ ప్రచారం కోసమని రణుకు రిచ్‌గా మేకోవర్‌ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. కొంతమంది నెటిజన్లు వాటిని మార్ఫింగ్‌ చేశారు. ముఖం నిండా ఫౌండేషన్‌ ఉన్నట్లుగా ఫొటోలు సృష్టించి విపరీతంగా ట్రోల్‌ చేశారు. ఈ విషయాలపై స్పందించిన రణు కూతురు ఎలిజబెత్‌ మాట్లాడుతూ... ఎంతో కష్టపడి ఒక స్థాయికి వచ్చిన తన తల్లిని హేళన చేయడం సరికాదని హితవు పలికారు.

’ట్రోలింగ్‌ గురించి తెలిసి చాలా బాధ పడ్డాను. మా అమ్మకు నిజంగానే అటిట్యూట్‌ ప్రాబ్లం ఉంది. అందుకే ఇబ్బందులపాలవుతుంది. అయితే ఎన్నో కష్టనష్టాలకోర్చి ప్రస్తుతం విజయం రుచి చూసింది. అలాంటి వ్యక్తిని కించపరచడం భావ్యంకాదు. అయినా నాకు కొంతమంది చేసే పనులు అస్సలు నచ్చడం లేదు. మా అమ్మ ఓ గాయని మాత్రమే. కానీ కొంతమంది ఆమె చేత ర్యాంప్‌ వాక్‌ చేయిస్తూ.. దిగజారి ప్రవర్తిస్తున్నారు. జనాలు తనను చూసి నవ్వుతున్నారు. మా అమ్మ ఉన్నత కుటుంబానికి చెందినది కాదు. అట్టడుగు ఆర్థిక పరిస్థితి నుంచి బాలీవుడ్‌కు వచ్చింది. వీధుల్లో పాటలు పాడుకునే తనకు ఒక్కసారిగా పేరు వచ్చింది. అందుకే ఎలా తయారు కావాలో తనకు తెలియదు. అయితే ఈ ఒక్క విషయానికే నెటిజన్లు మా అమ్మను ట్రోల్‌ చేయడం లేదు. ఎవరో సెల్ఫీ అడిగితే ఇవ్వకుండా అమ్మ దురుసుగా ప్రవర్తించింది. తనను ఫేమస్‌ చేసిన సామాన్యుల పట్ల అమ్మ అలా చేయకుండా ఉండాల్సింది. అందుకే మీమ్స్‌ సృష్టించి తనను ట్రోల్‌ చేస్తున్నారనుకుంటా’ అని చెప్పుకొచ్చారు. (చదవండి : ‘నా కాళ్లు విరగ్గొడతామని బెదిరించారు’)

కాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన రణు రైల్వే స్టేషనులో పాట పాడుతుండగా గమనించిన అతీంద్ర చక్రవర్తి అనే ఓ యువ ఇంజనీర్‌ ఆమె పాటను రికార్డు చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో ఆమె వెలుగులోకి వచ్చారు. ఈ క్రమంలో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అయితే రణుకు ఆశ్రయం కల్పించిన రణఘాట్‌ ఆమ్రా శోభై షోతాన్‌ క్లబ్‌ నిర్వాహకులపై ఆమె కూతురు ఎలిజబెత్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ అతీంద్ర చక్రవర్తి, తపన్‌ దాస్‌(క్లబ్‌ సభ్యులు) నిజంగా మా అమ్మ సొంత కుమారులు అయి ఉంటే ఆమెను బాగా చూసుకునేవారు. కానీ మా అమ్మ వాళ్ల దగ్గర ఉన్నట్లు నాకు సమాచారం ఇవ్వలేదు. తన గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లాలని ప్రయత్నించగా నా కాళ్లు విరగ్గొట్టి బయటకు విసిరి వేస్తామని బెదిరించారు. నాకు వ్యతిరేకంగా మా అమ్మ మనసు మార్చారు. తన సంపాదనను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. 
 

మరిన్ని వార్తలు