రైల్వే స్టేషన్‌లో పాట ఆమెను సెలబ్రిటీ చేసింది..!

24 Aug, 2019 12:06 IST|Sakshi

హిమేష్‌ రేష్మియాపై ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ :  ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ పాడిన అలనాటి క్లాసిక్‌ పాటలను తన గళంతో సుతిమెత్తగా ఆలాపిస్తూ.. సంగీత ప్రియుల హృదయాల్ని గెలుచుకున్న రణు మొండాల్‌ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తన గాన మాధుర్యంతో రాత్రికి రాత్రే పాపులరైన పశ్చిమ బెంగాల్‌కు చెందిన రణు మొండాల్‌ను బాలీవుడ్‌ నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు హిమేష్‌ రేష్మియా ప్రోత్సహించాడు. తన తదుపరి సినిమా ‘హ్యాపీ హార్డీ అండ్‌ హీర్‌’లో ఆమెకు పాట పాడే అవకాశం ఇచ్చాడు.

ఈ క్రమంలో రణు మొండాల్‌ పాట పాడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘తేరీ మేరీ కహానీ’ అనే పాటను ఆమె అద్భుతంగా ఆలపించారని చెప్పాడు. ‘మనం కన్న కలలు నిజమయ్యే రోజు తప్పక వస్తుంది. లక్ష్య సాధన కోసం కృషి చేయడం మాత్రం మరువొద్దు. ఎప్పుడూ పాజిటివ్‌ దృక్పథంతో ఆలోచిస్తేనే అది సాధ్యం. నన్ను అభిమానించే వారందరికీ ధన్యవాదాలు’అని హిమేష్‌ ఆ వీడియోకు క్యాప్షన్‌ పెట్టాడు. హిమేష్‌ మంచి మనసును చాటుకున్నాడని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
(చదవండి : అద్భుతమైన గానం.. నెటిజన్ల ఆనంద పారవశ్యం!) ‘.

ఈ నేపథ్యంలో ‘నిన్న రైల్వే స్టేషన్‌లో ఉన్న రణు మొండాల్‌ను నేడు ప్లేబ్యాక్‌ సింగర్‌ను చేశావ్‌. నీది చాలా గొప్ప మనసు’ అని కొందరు.. రణు మొండాల్‌ కలను నిజం చేశావ్‌ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక బెంగాల్‌లోని రణఘాట్‌ రైల్వేస్టేషన్‌లో రణ మొండాల్‌ పాడిన పాటల్ని ‘బర్పెటా టౌన్‌ ద ప్లేస్‌ ఆఫ్‌ పీస్‌’ అనే ఫేస్‌బుక్‌ పేజీ నెటిజన్లకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ‘లతా మంగేష్కర్‌లా తీయగా పాడుతోంది..‘రణాఘాట్‌ లత’ అని నెటిజన్లు కామెంట్లు చేశారు.

మరిన్ని వార్తలు