ఆ కీర్తి ఎంతో కాలం నిలవదు.. తాత్కాలికమే!

3 Sep, 2019 19:24 IST|Sakshi

అనుకరిస్తే గొప్పవాళ్లు కాలేరు...సొంత ప్రతిభ  వుండాలి- లతా మంగేష్కర్‌ 

ఇమిటేషన్‌ వల్లే వచ్చే కీర్తి ఎంతో కాలం నిలవదు..తాత్కాలికమే

తమకంటూ  సొంత శైలిని ఏర్పరచుకోవాలి

సోషల్‌ మీడియా సెన్సేషనల్‌ గాయని రణు మొండల్‌ ఉదంతంపై ప్రఖ్యాత బాలీవుడ్‌ గాయని లతా మంగేష్కర్‌ స్పందించారు. మొండల్‌ గాన ప్రతిభపై ఒక ఇంటర్వ్యూలో ఆమె తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  తన పాట ద్వారా, తన పేరు ద్వారా ఎవరైనా ప్రయోజనం పొందితే తనకు సంతోషమే.. కానీ గాయకులకు తమకంటూ సొంత ప్రతిభ ఉండాలని లత సూచించారు.  కాపీ కొట్టడం ద్వారా స్వల్పకాలిక ప్రయోజనమే తప్ప, దీర్థకాలిక ప్రయోజనాన్ని పొందలేరని అభిప్రాయపడ్డారు. తమకంటూ ఒక ప్రత్యేక శైలిని, ప్రతిభను సాధించాల న్నారు.  ఉదాహరణకు తన సోదరి  ఆశా భోంస్లే తనకంటూ ఒక  శైలిని ఏర్పర్చుకుని ఉండి ఉండకపోతే..ఆమె కూడా మరుగున పడిపోయేదంటూ  ఉదహరించారు.  

ఒకర్ని అనుకరించడం ద్వారా లభించిన పేరు ప్రఖ్యాతులు ఎంతోకాలం నిలవవని, అలాగే ఒకరిమీద ఆధారపడడం కూడా అంత మంచిదికాదని లతా మంగేష్కర్‌  తెలిపారు. కిషోర్‌ కుమార్, మొహ్మద్‌ రఫీ, ముఖేష్ భయ్యా, ఆశా భోంస్లే లాంటి ప్రముఖ గాయనీ గాయకుల పాటలను పాడటం ద్వారా స్వల్ప కాలికంగా అందరి దృష్టిని ఆకర్షించగలం ..అయితే అది ఎక్కువ కాలం ఉండదని ఆమె  పేర్కొన్నారు.  

చాలామంది ప్రతిభావంతులైన పిల్లలు, యువతీయువకులు  టీవీలో ప్రసారమయ్యే మ్యూజిక్ షోలలో తమ  పాటలు పాడతారు, కానీ కొంతకాలం తర్వాత లేదా విజయం సాధించిన తర్వాత వారికి గుర్తుండదు. ప్రతిభావంతులైన, ఔ త్సాహిక గాయకులందరూ సొంత నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని,  తద్వారా సొంత గుర్తింపును సాధించాలంటూ ఈ సందర్భంగా లతాదీ  సలహా ఇచ్చారు. లెజెండ్రీ  సింగర్స్‌  పాటలను పాడే అవకాశం వారికెపుడూ వుంటుంది. కానీ సొంత గుర్తింపు ముఖ్యం, అదే నిత్యం అని  లతా  స్పష్టం చేశారు. ఈ క్రమంలో  పరిశ్రమలో నిలదొక్కుకున్న, తనకు తెలిసిన గాయకులు శ్రేయా ఘోసల్,  సునిధి చౌహాన్ అని ఆమె ప్రశంసించారు.

కాగా లతా మంగేష్కర్‌ ఆలపించిన బాలీవుడ్‌ పాట ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై’ పాటతో రణు మొండల్‌ వెలుగులోకి వచ్చారు. మనోహరమైన ఆమె గాత్రానికి నెటిజన్లు ఫిదా అయి పోయారు. అంతేకాదు బాలీవుడ్‌ గాయకుడు హిమేష్‌ రేష్మియా ఆమెకు మంచి అవకాశాన్నిచ్చారు. ఇది కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. అటు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ కూడా తన రాబోయే యాక్షన్ థ్రిల్లర్ దబాంగ్ 3 చిత్రంలో పాడే అవకాశాన్నికల్పించారు. ఇది ఇలావుంటే.. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న చందంగా.. సల్మాన్‌ ఖాన్‌ రణు మొండల్‌కు రూ.55 లక్షల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చాడని,  రణు మొండల్‌ని లతా మంగేష్కర్‌ ప్రశంసలతో ముంచెత్తారంటూ ఫేక్‌ న్యూస్‌లు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. 

చదవండి : ఆమె మొదటి భర్త కూతురిని; గర్వపడుతున్నా!

రైల్వే స్టేషన్‌లో పాట ఆమెను సెలబ్రిటీ చేసింది..!

మరిన్ని వార్తలు