లత మంగేష్కర్‌ విమర్శలు.. రాణు స్పందన!!

16 Sep, 2019 11:52 IST|Sakshi

రాణు మొండాల్‌.. రైల్వే స్టేషన్‌లో యాచకురాలి నుంచి ఒక్కసారిగా ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా దేశవ్యాప్తంగా ప్రసిద్ధురాలైన సింగర్‌ ఆమె. రైల్వే స్టేషన్‌లో ఆమె పాడిన పాట ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. ఓవర్‌నైట్‌ ఆమె స్టార్‌ సింగర్‌గా మారిపోయారు.  ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు హిమేష్‌ రెష్మియా కూడా ఆమెకు అవకాశమిచ్చారు. ఆమె పాడిన పాటలు సంగీత ప్రియుల మదిని దోచుకుంటున్నాయి.

కానీ, ఒక్కసారిగా తెరమీదకు వచ్చి పాపులర్‌ అయిన రాణు మొండాల్‌ను ఉద్దేశించి ప్రఖ్యాత సింగర్‌ లతా మంగేష్కర్‌  స్పందిస్తూ.. పలు విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఒకరి పాటను ఇమిటేట్‌ చేయడం ద్వారా ప్రజాదరణ పొందవచ్చేమో కానీ, అది కళ కాబోదని పేర్కొన్నారు. రాణు ఇమిటేట్‌ చేయడం మానుకొని.. ఒరిజినల్‌గాఉండేందుకు ప్రయత్నించాలని సూచించారు. లత పాడిన ‘ఏక్‌ ప్యార్‌కి నగ్మా హై’ పాటను బెంగాల్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో రాణు హృద్యంగా ఆలాపించడం ద్వారా పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. లత విమర్శలపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక లెజెండ్‌ సింగర్‌ అయిన లత రాణు విషయంలో కొంత ఉదారంగా ఉండాల్సిందని, ఆమె పెద్ద హృదయాన్ని చాటుకోలేకపోయారని పలువురు ఆవేదన చెందారు. కానీ, రాణు మాత్రం లత విమర్శల పట్ల ఏమాత్రం అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పైగా లత తన కంటే సీనియర్‌ అని, చిన్నప్పటి నుంచి ఆమె పాటలు వింటూ పెరిగానని, ఎప్పుడూ ఆమెకు జూనియర్‌గానే ఉంటానని ఆమె పట్ల కృతజ్ఞతలు చాటుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో రాణు చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల హృదయాలను హత్తుకుంటున్నాయి.  
చదవండి: కూతురి పట్ల విమర్శలపై రాణు స్పందన

మరిన్ని వార్తలు