దీపికతో పెళ్లిపై రణ్ వీర్ రియాక్షన్..

14 Jul, 2016 18:59 IST|Sakshi
దీపికతో పెళ్లిపై రణ్ వీర్ రియాక్షన్..

ముంబై: బాలీవుడ్ రొమాంటిక్ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనేల ప్రేమ.. పెళ్లి పీటలెక్కనుందని టాక్. ఇలీవలే ఆస్ట్రియాలో ఇరు కుటుంబాలు కలిసి హాలిడేను ఎంజాయ్ చేసినట్లు తెలుస్తుంది. పనిలో పనిగా ఈ ప్రేమ పక్షులను ఓ గూటికి చేర్చే ముచ్చట కూడా జరిపినట్లు వినికిడి. ఇప్పటికే బాజీరావ్, మస్తానీకి అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం జరిగిందనే వార్త ప్రచారంలో ఉండగా.. తాజాగా వీళ్ల పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని, 2017లో వివాహం జరుగనుందనే వార్తలు బీ టౌన్లో వీర విహారం చేస్తున్నాయి.  

తన తదుపరి చిత్రం 'బేఫికర్' షూటింగ్ నుంచి గురువారం ఉదయమే ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్న రణ్ వీర్ను మీడియా చుట్టుముట్టేసింది. 2017 లో మీ పెళ్లంట కదా అని విలేకరులు ప్రశ్నించగా.. 'ఇప్పుడే కదా వచ్చాను.. కొంత సమయం తర్వాత తెలుస్తుంది' అంటూ తెలివైన సమాధానం ఇచ్చాడు. మరి దీపికాతో రిలేషన్ సంగతేంటని అడగ్గా... 'అరె..ఏం మాట్లాడుతున్నారు? పొద్దున పొద్దున్నే నిద్ర కూడా పూర్తి కాలేదింకా..' అంటూ విషయాన్ని ఏమాత్రం ఖండించకుండా అక్కడి నుంచి జారుకున్నాడు రణ్ వీర్. దీంతో వీళ్ల వివాహం ఖాయమేనంటూ గాసిప్స్ గుప్పుమంటున్నాయి.