చిన్నారులపై అత్యాచారాలు దేశానికే సిగ్గుచేటు

18 Apr, 2018 00:28 IST|Sakshi

చిన్నారులపై అత్యాచారాలు దేశానికే సిగ్గుచేటని జయప్రద అన్నారు. జమ్ము కశ్మీర్‌లోని కఠువా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లలో ఇటీవల చిన్నారులపై జరిగిన అత్యాచార సంఘటనలను ఆమె ఖండించారు. న్యాయవ్యవస్థపై రాజకీయాలు ఎంతగా ప్రభావం చూపుతున్నాయంటే, ఆ ప్రభావం వల్ల దేశంలో బాధిత మహిళలకు ఎలాంటి న్యాయం దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచార సంఘటనలు దేశంలోని రాజకీయ వ్యవస్థకు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నా, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు.

చిన్నారి బాలికలకు దేశంలో భద్రత కరువైపోతోందని, ఇంటా బయటా ఎక్కడా వారికి సురక్షితమైన పరిస్థితులు లేవని జయప్రద పేర్కొన్నారు. కఠువాలో చిన్నారిపై ఏకంగా దేవాలయంలో సామూహిక అత్యాచారానికి తెగబడ్డారని, అంతకు కొన్నాళ్ల ముందు ఉన్నావ్‌లో మైనర్‌ బాలికపై పలుకుబడి గల అధికార పార్టీ ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, జరిగిన అన్యాయంపై నోరెత్తిన పాపానికి బాధితురాలి తండ్రిని హతమార్చారని అన్నారు. ఈ రెండు సంఘటనలూ దేశవ్యాప్తంగా సామాన్యుల మనసులను కలచివేశాయని ఆమె అన్నారు. 

మరిన్ని వార్తలు