అవినాకు నచ్చవు..

17 Nov, 2019 09:25 IST|Sakshi

టాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజీ నటి ఎవరంటే ముందుగా చెప్పే పేరు నటి రష్మిక మందన్నా. అవును అతికొద్ది కాలంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్న నటి ఈ బ్యూటీ. కన్నడం నుంచి దిగుమతి అయిన రష్మిక ‘చలో’ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత గీతగోవిందం చిత్రం వరించింది. అంతే ఆ చిత్ర అనూహ్య విజయంతో రష్మిక పేరు మారుమోగిపోయింది. అప్పుడే కోలీవుడ్‌ దృష్టి ఈ అమ్మడిపై పడింది. అప్పుడే నటుడు విజయ్‌తో రొమాన్స్‌ చేయబోతోందనే ప్రచారం హోరెత్తింది. అదే నిజం అయితే ఈ చిన్నది బిగిల్‌ చిత్రంలో నటించాల్సింది. అయితే అది ఒట్టి వదంతిగానే మిగిలిపోయింది. కాగా గీతగోవిందం తరువాత మరోసారి విజయ్‌దేవరకొండతో జతకట్టిన మిస్టర్‌ కామ్రేడ్‌ చిత్రాన్ని తమిళంలోనూ అనువదించి విడుదల చేశారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా రష్మిక పేరు బాగానే పాపులర్‌ అయ్యింది. 

ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో సరిలేరు నీకెవ్వరూ, అల్లుఅర్జున్‌తో అల వైకుంఠపురములో, నితిన్‌కు జంటగా భీష్మా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అదే విధంగా కోలీవుడ్‌ ఎంట్రీ షురూ అయ్యింది. నటుడు కార్తీతో సుల్తాన్‌ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా రష్మిక ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ప్రముఖ కథానాయకులతో నటించే అవకాశాలు వస్తున్నాయని, విశ్రాంతి లేకుండా నటించడం సంతోషంగా ఉందని చెప్పింది. అయితే ఎన్ని చిత్రాల్లో నటించినా, ఎంత పెద్ద స్టార్స్‌తో జత కట్టినా గర్వం అన్నది లేకుండా, నిరాడంబరంగానే  ఉంటానని అంది.

ఇంకా చెప్పాలంటే తనకు అలంకారాలు, ఆడంబరాలు అస్సలు నచ్చవని, సినిమాల కోసం అందంగా కనిపించినా, నిజజీవితంతో అలా అవసరం లేదని పేర్కొంది. తనకు మేకప్‌ వేసుకోవడం, అలంకరించుకోవడం నచ్చదని అంది. తన లాంటి నటీమణుల్ని చూడడానికి అభిమానులు ఇష్టపడతారా అని తొలి చిత్రంలో నటించినప్పుడు భయపడినట్లు తెలిపింది. అయితే కథలో పాత్ర బాగుంటే గ్లామర్‌ లేకపోయినా ఆదరిస్తారని ఆ తరువాత అర్థమైందని పేర్కొంది. తనకు సహజంగా ఉండడమే నచ్చుతుందని, షూటింగ్‌లకు కాకుండా బయటకు వెళితే ఎలాంటి మేకప్‌ వేసుకోకుండానే వెళతానంది. ఇకపోతే  అవకాశాలు వస్తున్నాయి కదా అని అన్నీ ఒప్పేసుకోనని స్పష్టం చేసింది.  తాను అంగీకరించిన చిత్రాలకు నూరు శాతం సహకరిస్తానని అంది. ఒక మంచి పాత్ర కోసం 10 ఏళ్లు అయినా వేచి ఉంటానని నటి రష్మిక అంటోంది.

మరిన్ని వార్తలు