‘ఛలో సినిమా పుణ్యమా అని తెలుగు తెలిసింది’

11 Aug, 2019 13:45 IST|Sakshi

‘కిరాక్‌ పార్టీ’ (కన్నడ) సినిమాతో తెరంగేట్రం చేసిన రష్మిక మందన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ‘గీతాగోవిందం’, ‘దేవదాస్‌’ సినిమాలతో మరింత చేరువయ్యింది. ‘డియర్‌ కామ్రేడ్‌’లో లిల్లీ పాత్రతో అద్భుతమైన నటనను ప్రదర్శించిన రష్మిక తన గురించి చెప్పిన కొన్ని ముచ్చట్లు....
కష్టం–ఇష్టం
నా స్వస్థలం కొడగు జిల్లా(కర్ణాటక)లోని విరాజ్‌పేట్‌. జర్నలిజంలో గ్రాడ్యుయేషన్‌ చేశాను. నా మదిలో ఎప్పటి నుంచో నటనకు సంబంధించి ఆసక్తి ఉంది. అందుకే నా కలలను నిజం చేసుకోవడానికి తొలిమెట్టుగా మోడలింగ్‌ రూట్‌ను ఎంచుకున్నాను. బ్యాక్‌గ్రౌండ్, సరిౖయెన కాంటాక్ట్‌లు లేకుండా సినిమా ఫీల్డ్‌లోకి ప్రవేశించడం ఎంత కష్టమో నాకు తెలియనిది కాదు. అలా అని ఆగిపోలేదు.  ఏదో ఒక రోజు వెండితెరపై కనిపిస్తానన్న గట్టి నమ్మకం ఉండేది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నమ్మకం కోల్పోలేదు. మోడలింగ్‌ ద్వారా  కెమెరాను ఎలా ఫేస్‌ చేయాలో నేర్చుకోగలిగాను.

చిరునవ్వుతో...
వైవిధ్యమైన సాంస్కృతిక వాతావరణం నుంచి వచ్చిన నాకు మొదట బెంగళూరు, ఇక్కడి వాతావరణం, లైఫ్‌స్టైల్‌ కొత్తకొత్తగా అనిపించేవి. అయితే త్వరలోనే ఈ వాతావరణానికి అలవాటు పడిపోయాను. ‘మనం ఏంటి?’ అనేదానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. విజయానికి ప్రతిభ ఎంత ముఖ్యమో ఆత్మవిశ్వాసం కూడా అంతే ముఖ్యం. ‘‘నా వల్ల కాదేమో’’ అనుకుంటే అది ఎప్పటికీ కాదు. ‘‘యస్‌... సాధించగలను’’ అనుకుంటే ఆ నమ్మకం ఎప్పుడూ వృథా పోదు. చిన్న చిన్న విషయాలకే చలించను. ధైర్యం కోల్పోను. నా పెదాలపై ఎప్పుడూ చిరునవ్వు ఉండాల్సిందే. అది నా ఆత్మవిశ్వాసానికి సంకేతం. నాకు నవ్వడం ఎంత ఇష్టమో నా చుట్టుపక్కల వాళ్లను నవ్వించడం కూడా అంతే ఇష్టం.

చలో చలో...
కేవలం రంగుల కలలు కని సినిమాల్లోకి రాలేదు. ఈ వృత్తిలో ఉండే సాధకబాధకాల గురించి నాకు తెలుసు. అయితే ప్రతి వృత్తిలో ఉన్నట్లే సినిమారంగంలో కూడా ఒడిదొడుకులు, ఎగుడుదిగుళ్లు ఉంటాయనేది కూడా బాగా తెలుసు. నా మనసులో కోరిక మొదట పేరేంట్స్‌కు చెప్పినప్పుడు భయపడిపోయారు. అయితే నా మొదటి సినిమా ‘కిరాక్‌ పార్టీ’ టీమ్‌ను కలిసిన తరువాత వారి అభిప్రాయంలో మార్పు వచ్చింది. ఆ సినిమాలో నటించడం మంచి అవకాశం అనే విషయం అర్థమైంది. ఇక భాష విషయానికి వస్తే– తమిళం అర్థమవుతుంది. మలయాళం చాలా కొంచెం అర్థమవుతుంది. తెలుగు మాత్రం ఒక్క ముక్క కూడా రాదు. ‘ఛలో’ సినిమా పుణ్యమా అని తెలుగు తెలిసింది. సెట్‌లోని వాతావరణమే తెలుగు నేర్పించే గురువు అయింది. తాజాగా ‘డియర్‌ కామ్రేడ్‌’లో నా నటనకు వచ్చిన ప్రశంసలు సంతోషాన్ని ఇచ్చాయి. ఈ సినిమాలో స్టేట్‌ లెవెల్‌ క్రికెటర్‌ ‘లిల్లీ’ పాత్ర కోసం కొన్ని నెలల పాటు క్రికెట్‌ పాఠాలు నేర్చుకున్నాను.

మరిన్ని వార్తలు