ఆ తప్పు ఇక చేయను!

5 Dec, 2019 07:40 IST|Sakshi

సినిమా: అలా చేయకూడదని ఇప్పుడు అర్థమైంది. ఇకపై ఆ తప్పు చేయను అంటోంది నటి రష్మికమందనా. ఇంతకీ ఏమిటీ అమ్మడు చేసిన తప్పు. ఇప్పుడు ఏం అవగతం అయ్యింది? లాంటి సందేహాలు కలుగుతున్నాయా? ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా వెలిగిపోతున్న నటి రష్మిక. ఒక్క అడుగు జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లుగా ఈ కన్నడ భామ జాతకాన్ని గీతగోవిందం అనే ఒక్క చిత్రం మార్చేసింది. అలా టాలీవుడ్‌లో రాత్రికి రాత్రే స్టార్‌ అయిన నటి రష్మిక అని చెప్పవచ్చు. ఈ తరువాత నటించిన ఏ చిత్రం పెద్దగా ఆడకపోయినా స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు ఈ చిన్నదానికి వరుస కట్టేస్తున్నాయి. తెలుగులో మహేశ్‌బాబు, అల్లుఅర్జున్‌ వంటి స్టార్స్‌తో జత కట్టేస్తోంది. ఇక కోలీవుడ్‌లోనూ ఈ అమ్మడి జోరు మొదలైంది. ఇక్కడ కార్తీకి జంటగా సుల్తాన్‌ అనే చిత్రంలో నటిస్తోంది. దీంతో రష్మికలో చాలా మార్పు వచ్చేసిందంటున్నారు సినీ వర్గాలు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి కాబట్టి పారితోషికం విషయంలో ఎటూ పెంచేసిందనుకోండి.

దానితో పాటు అహంకారం పెరిగిందని చెవులు కొరుక్కుంటున్నారు. ఇకపోతే ఇటీవల ఈ అమ్మడు ఇటీవల గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ భారతీయ చిత్రోత్సవాల్లో పాల్గొంది. ఆ వేదికపైకి అందాలారబోసే దుస్తులు ధరించి అందరినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంటూ మూడేళ్లుగా విరామం లేకుండా నటించేస్తున్నాను అని చెప్పింది. ఇలా రెస్ట్‌ లేకుండా నటించడం వల్ల తనకు తానే శారీరకంగానూ, మానసికంగానూ అలసటను కొనితెచ్చుకుంటున్నాను అని చెప్పింది. వారంలో ఆదివారం అయినా విరామం దొరుకుంతేమోనని తన శరీరం తపిస్తోందని అంది. ప్రస్తుతం ఏక కాలంలో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పింది. అలా ఉదయం ఒక రాష్ట్రం, మధ్యాహ్నం ఒక రాష్ట్రం, సాయంత్రం ఒక రాష్ట్రం అంటూ పరుగులు తీస్తున్నానని చెప్పింది. దీంతో పనే ముఖ్యం కాదని, శరీరంపైనా శ్రద్ధచూపడం అవసరం అన్న విషయం అర్థమైందని పేర్కొంది. ప్రస్తుతం ఏక కాలంలో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నానని, అయితే ఇకపై అలాంటి తప్పు చేయకూడదని భావిస్తున్నానని చెప్పింది. ఎన్ని చిత్రాలు చేసినా వాటి ద్వారా మనం ఏం నేర్చుకున్నామన్నది ముఖ్యం అని పేర్కొంది. రెండు నెలలకు ముందు తాను డెంగీ వ్యాధికి గురయ్యానని, ఆ సమయంలో అవుట్‌ డోర్‌ షూటింగ్‌లో ఉన్నానని చెప్పింది. అలా డెంగీతో బాధపడుతూ, శరీరం సహకరించకపోయినా నటించానని చెప్పింది. తాను పోరాడే గుణం కలదానినని, దేన్నీ సులభంగా వదలిపెట్టనని అని రష్మిక మందనా చెప్పుకొచ్చింది.   

మరిన్ని వార్తలు