‘పరిస్థితి ఇంత దారుణంగా ఉందని అనుకోలేదు’

14 Dec, 2018 16:11 IST|Sakshi

పెరుగుతున్న జనాభాతో పాటు మన దేశంలో కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. తినే తిండే, తాగే నీరు, పీల్చే గాలి ఇలా ప్రతీది కాలుష్యం బారిన పడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో గాలి కూడా విషమవడం చూస్తూనే ఉన్నాం. ఈ నగరాల చుట్టూ ఉన్న చెరువులు కాలుష్య కాసారాలు అవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఈ కాలుష్య భుతాన్ని మాత్రం అదుపు చేయలేకపోతుంది. అయితే సమస్యకు కారణమవుతోన్న మనుషుల్లో మార్పు రానవంత వరకూ.. ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు. ఇదే విషయాన్ని జనాలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు హీరోయిన్‌ రష్మిక మందన్న.

నీటి కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేశారు రష్మిక. కర్ణాకటలోని అతి పెద్ద చెరువైన బెళ్లందూర్‌లో ఫోటో షూట్‌ చేశారు. అనంతరం ఈ ఫోటోలను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘గొప్ప టీమ్‌తో కలిసి నీట కాలుష్యం పట్ల అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాను. బెల్లందూర్‌ చెరువు దగ్గరకు వచ్చి చూసే వరకూ దీని పరిస్థితి ఇంత దారుణంగా ఉందని అనుకోలేదు. కొన్నేళ్ల క్రితం వరకూ ఈ చెరువు ఎంత అందంగా ఉండేదో గుర్తొచ్చి నా గుండే బద్దలయ్యింది. ప్రతి చోట ఇలానే ఉంది. ఇలాంటి చోట ఉండాలని నేనైతే అనుకోను. మీతో పంచుకోవాలి అనిపించి చెబుతున్నా’ అంటూ రష్మిక ట్వీట్‌ చేశారు.

అయితే కర్ణాటక రాష్ట్రంలోనే అత్యంత కలుషితమైన చెరువుగా బెళ్లందూర్‌ నిలిచింది. కొన్ని రోజుల క్రితం ఈ చెరువు నుంచి మంటలు కూడా ఎగసి పడ్డాయి.

మరిన్ని వార్తలు