చిత్ర సీమలో మరో యువ కెరటం

31 Dec, 2019 09:32 IST|Sakshi

ఖోఖో కథాంశంతో ‘రథేరా’ 

దర్శకుడు రమేష్‌తో సహా అంతా జిల్లా వాసులే 

75 మంది నూతన నటులతో చిత్రీకరణ 

 రేపు తెలుగు రాష్ట్రాల్లో చిత్రం విడుదల

సాక్షి, కడప: వైఎస్సార్‌ జిల్లా కళలకు కాణాచి. అటు నాటక రంగం.. ఇటు సీనీ రంగంలో ఎందరో ప్రముఖులు తమ దైన ముద్రను వేశారు. అంతర్జాతీయ స్థాయిలో కడప ఖ్యాతి చాటారు. ఇప్పుడు 29 ఏళ్ల మరో యువ కెరటం జాకట రమేష్‌ నిరాదరణకు గురవుతున్న భారతీయ ప్రాచీన క్రీడ ఖోఖో కథాంశంతో ‘రథేరా’ చిత్రాన్ని నిర్మించారు. ఈయన 2016లో రైతుల సమస్యలపై తీసిన ఒక షార్ట్‌ ఫిల్మ్‌కు జాతీయ స్థాయి అవార్డు లభించింది.  రథేరా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో జనవరి 1న విడుదల అవుతోంది. అగ్ర హీరోల సినిమాలు రాబోతున్న తరుణంలో కొత్త వారితో ‘రథేరా’ విడుదల కావడం ఆసక్తిని రేపుతోంది. ఫోర్‌ హ్యాండ్స్‌ మీడియా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం విడుదల సందర్భంగా దర్శకుడు జాకట రమేష్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.  

సాక్షి : మీ నేపథ్యం వివరాలు? 
రమేష్‌ : మాది వైఎస్సార్‌ జిల్లా చాపాడు మండలం, రాజుపాలెం గ్రామం అమ్మ పేరు దేవమ్మ, నాన్న పేరు ఏలిఆయ, చెల్లెలు ప్రశాంతి. నేను ప్రొద్దుటూరు ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ వరకు చదివాను. 

సాక్షి : సినీ రంగంపై ఎలా ఆసక్తి పెరిగింది? 
రమేష్‌ : చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. సినీ రంగంలో నిలబడి సందేశాత్మక చిత్రాలు నిర్మించాలనేది నా కోరిక. అందుకోసం కథలను రాసేవాడిని. ఈ క్రమంలో 2011లో ‘ఎ డ్రై స్టోరీ’ షార్ట్‌ ఫిల్మ్‌ను తీశాను. చిత్రాన్ని నిర్మించాను. ఇదే సందర్భంలో కెమెరాపై ఆసక్తి పెరిగింది. తరువాత కెమెరామెన్‌గా పట్టు సాధించాను. 2011లో రైతుల సమస్యలపై ఒక లఘ చిత్రాన్ని రూపొందించాను. దీనికి హైదరాబద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎడిటింగ్‌ విభాగానికి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. తరువాత 30 షార్ట్‌ ఫిల్మ్‌లకు పని చేశాను. 10 లఘ చిత్రాలను స్వయంగా తీశాను.  

సాక్షి : ఖోఖో క్రీడాంశంతో ఎందుకు సినిమా తీయాలనిపించింది? 
రమేష్‌ : నేను ఖోఖో క్రీడాకారుడిని. 2006లో అహ్మదాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడాను. ప్రస్తుతం క్రికెట్, ఫుట్‌బాల్, షటిల్‌ తదితర ఆటలకు విపరీతమైన ఆదరణ పెరిగింది. దీంతో భారత ప్రాచీన క్రీడ ఖోఖోకు ఆదరణ తగ్గింది. ఈ తరుణంలో ఖోఖో క్రీడకు మళ్లీ పూర్వ వైభవం తేవాలని సంకల్పించాను. 

సాక్షి : రథేరా అంటే? 
రమేష్‌ :    పూర్వం రథాల ద్వారా ఆడే ఆటను రథేరా అని పిలిచేవారు. ఈ ఆట మహారాష్ట్రలో పుట్టింది. ఇది యుద్ధ తంత్రాలు, వ్యూహాలకు సంబంధించిన ఆట. క్రమేణా ఈ ఆట మార్పులు చేసుకొని ఖోఖోగా మారింది. ఇది మన దేశ అతి ప్రాచీన క్రీడ. 

సాక్షి : ఎంతమంది నటులతో సినిమాను తీశారు? 
రమేష్‌ : ఈ చిత్రంలో హీరోగా సిద్దు, హీరోయిన్‌గా మానస, విలన్‌గా కృష్ణమూర్తి, నరేష్‌యాదవ్‌ నటించారు. ఖోఖో క్రీడాకారులుగా 9 మందిని ఎంపిక చేసి వారికి ఒకటిన్నర నెల శిక్షణ ఇచ్చాం. మొత్తం 75 నూతన నటులతో సినిమా తీశాం. అందులో హీరోయిన్‌ మినహా అందరూ మన జిల్లాకు చెందిన వారే.  

సాక్షి : మాజీ మేయర్‌ సురేష్‌బాబు పాత్ర ఎలాంటిది? 
రమేష్‌ : ఇందులో కడప మాజీ మేయర్‌ సురేష్‌బాబు ఒక ఆఫీసర్‌ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో ఈ పాత్ర కీలకమైంది. సురేష్‌బాబు అద్భుతంగా నటించారు. 

సాక్షి : ప్రముఖులు ప్రశంసించినట్లుగా తెలిసింది? 
రమేష్‌ : ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్‌ సత్యనారాయణ సినీనటులు ఫృద్వీ ఈ చిత్రాన్ని చూసి ప్రశంసించడం సంతోషంగా ఉంది. జనవరి 1న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 45కు పైగా థియేటర్లలో సినిమా విడుదల అవుతోంది.  పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్న తరుణంలో మా చిన్న సినిమా వస్తోంది. అయినా తట్టుకొని నిలబడుతామనే నమ్మకం ఉంది. ఎందుకంటే మా కథలో జీవం ఉంది. మనసును కదిలించే సన్నివేశాలు ఉన్నాయి. పైగా మంచి సినిమాను ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉంది.

ప్రశ్న: ఎన్ని రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశారు? 
జవాబు: జూలై 2018లో కడపలోని ఎన్జీఓ కాలనీ సాయిబాబా గుడిలో షూటింగ్‌ ప్రారంభించాం. చిత్రీకరణ అంతా 98 శాతం జిల్లాలోనే సాగింది. ఒక షాట్‌ మాత్రమే నెల్లూరులో తీశాం. 58 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా