అందుకే నేను చాలా సినిమాలు వదులుకున్నాను : రవిబాబు

31 Mar, 2015 23:45 IST|Sakshi
అందుకే నేను చాలా సినిమాలు వదులుకున్నాను : రవిబాబు

ఈ తరం దర్శకుల్లో రవిబాబు రూటే సెపరేటు. ఆసక్తికరమైన కథాంశాలతో ‘అల్లరి’, ‘అనసూయ’, ‘సోగ్గాడు’, ‘నచ్చావులే’, ‘అవును’ లాంటి సినిమాలు చేయడమే కాకుండా, వైవిధ్యంగా ఆ చిత్రాలకు ప్రచారం చేసుకున్నారు. స్టార్‌లకన్నా స్టోరీలనే నమ్ముతానంటున్న ఈ సృజనాత్మక దర్శకుని తాజా ప్రయత్నం ‘అవును-2’. ఈ నెల 3న విడుదల కానున్న ఈ సినిమా గురించి, తన కెరీర్ గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా సంభాషించారు.

‘అవును’కు రెండో భాగం చేయాలని ఎందుకనిపించింది?
‘అవును’ సినిమా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. టీవీలో ప్రసారమైన ప్రతిసారీ నాకు లెక్కలేనన్ని ఫోన్లు. అందుకే రెండో భాగం చేశా. నిజానికి ఆ సినిమా చేస్తున్నప్పుడే, రెండో భాగం చేయాలనుకున్నా. ‘అవును’ ఆఖరి సన్నివేశం చూస్తే మీకర్థమవుతుంది.

మీ సినిమాల ప్రచారం భలే గమ్మత్తుగా ఉంటుందే!
(నవ్వుతూ) అప్పట్లో కుక్కపిల్లల బొమ్మలతో ‘నచ్చావులే’ సినిమాకు ప్రచారం చేశాం. ‘అవును’ టైమ్‌లో... పోస్టర్‌లో భయమేసే అంశమేదో పెడదామని ఏనుగును ఉపయోగించా. ‘అవును2’కి రెండు తలలున్న ఏనుగు వాడా. వీటికి పెద్ద లాజిక్కేమీ లేదు.

సినిమాలు వేగంగా తీస్తారని పేరు. కానీ 12 ఏళ్లల్లో 12 సినిమాలే చేయగలిగారు?
ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాలి, ఇంత డబ్బు గడించాలి లాంటి లక్ష్యాలేమీ లేవు. నా మనసుకి నచ్చిన కథతో, అందర్నీ మెప్పించేలా సినిమా తీయాలన్నదే నా కోరిక. కథ నన్ను ఉద్వేగపరచకపోతే నేనస్సలు సినిమా తీయను. తీయలేను. ఎవరో హీరో చేస్తారనో, నిర్మాత అడ్వాన్స్ ఇచ్చారనో తొందరపడను. అందుకే నేను చాలా సినిమాలు వదిలేసుకున్నాను. కథ తయారీకి నేను చాలా ఎక్కువ సమయం తీసుకుంటా. మేకింగ్ మాత్రం చాలా వేగంగా చేసేస్తా.

స్టార్స్‌తో సినిమాలు చేసే ఉద్దేశం కూడా లేదా?
నేను స్టార్స్ కంటే యాక్టర్స్‌కే ప్రాధాన్యమిస్తా. బాగా యాక్ట్ చేయగలిగేవాళ్లతోనే నేను పని చేయాలనుకుంటా కానీ, పెద్ద స్టార్స్‌తో కాదు.

అంటే మీ దృష్టిలో స్టార్స్‌లో యాక్టర్స్ లేరా?
స్టార్స్‌లో కూడా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ప్రస్తుతానికి నేను స్టార్స్‌తో సినిమాలు చేయాలనుకోవడం లేదు. నా కథ డిమాండ్ చేసినప్పుడు మాత్రం వాళ్ల కోసం ఎంతకాలమైనా ఆగుతా.

హ్యూమర్, హారర్ తరహా చిత్రాలకే పరిమితమయ్యారెందుకని?
అదేం లేదు. నెక్ట్ప్ నేను నాకిష్టమైన యాక్షన్ జానర్‌లో సినిమా చేయనున్నా. నాకు రెగ్యులర్ హీరో ఇంట్రడక్షన్ ఫైట్లు, ఇంటర్వెల్ ఫైట్లు, కై్లమాక్స్ ఫైట్లు అంటే చాలా చిరాకు. వాటికి కొంచెం భిన్నమైన యాక్షన్ సినిమానే ప్రేక్షకులకు అందిస్తా.

మీ మేకింగ్ స్టయిల్ బాలీవుడ్ తరహాలో ఉంటుంది. హిందీలో ప్రయత్నించొచ్చుగా?
నేను హిందీ సినిమాలు చూడటమే చాలా రేర్. దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ లాంటి కొందరివే చూస్తా. నా మీద బాలీవుడ్ ప్రభావం లేదు. హాలీవుడ్ సినిమాలే ఎక్కువ చూస్తా.

మరి తెలుగు సినిమాలు చూడరా?
చాలా తక్కువ చూస్తాను. ఈ పదేళ్లలో వచ్చిన ఏ సినిమా నాకు నచ్చలేదు. ఒకే కథతో... ఒకే ఫార్ములాతో ఆర్టిస్టుల్ని మార్చి సినిమాలు తీస్తున్నారు.

నచ్చిన సినిమాలు అస్సలు లేవా?
‘హ్యాపీడేస్ నచ్చింది. ‘బొమ్మరిల్లు’ ఎక్స్‌ట్రార్డినరీ.

మరి సినిమాలు చూడకపోతే ప్రేక్షకుల ట్రెండ్ గురించి ఎలా తెలుస్తుంది?
నేనసలు ట్రెండ్ గురించి ఆలోచించను. నా సినిమాలే ట్రెండ్ సెట్టర్ కావాలని కోరుకుంటా. నేను ఏ సినిమా తీసినా ఓ ప్రేక్షకుడి కోణంలో ఆలోచిస్తా.

సినిమా ఫంక్షన్లు, పార్టీల్లో పెద్దగా కనబడరు?
నాకు సినిమా, ఇల్లు తప్ప వేరే వ్యాపకాలు లేవు. రాత్రి 9 గంటలకు పడుకుని, ఉదయం 4-30 గంటలకు నిద్రలేస్తా.

ఓ పక్క డెరైక్షన్... మరోపక్క యాక్టింగ్. రెండింటినీ ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు?
నేను డెరైక్షన్ చేసేటప్పుడు వేషాలు ఒప్పుకోను. ‘రుద్రమదేవి’లో రెండుసార్లు నటించే అవకాశం వచ్చింది. మొదటిసారి ‘లడ్డూబాబు’, రెండోసారి ‘అవును-2’ అడ్డుపడ్డాయి. అందుకే ఆ సినిమాలో చేయలేకపోయా. నిజం చెప్పాలంటే... నేను చేసిన సినిమాల కన్నా వదిలేసినవే ఎక్కువ. నాకు యాక్టింగ్ అంటే సరదా. దర్శకత్వం వృత్తి. రెండింటినీ ఆస్వాదిస్తున్నా.

దర్శకునిగా మీ ప్రణాళికలేంటి?
చాలా ఉన్నాయి. అన్నీ ప్రయోగాలే. ఈ వైవిధ్యమైన పంథాన్ని వదిలే ప్రసక్తి లేదు.