రవితేజ నటించడంతో రోమియో స్థాయి పెరిగింది

9 Oct, 2014 23:20 IST|Sakshi
రవితేజ నటించడంతో రోమియో స్థాయి పెరిగింది

‘‘అన్నయ్య పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోల పాత్రలు ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటాయో, ఇందులో నా పాత్ర కూడా అంత ఎనర్జిటిక్‌గా ఉంటుంది. అన్నయ్య ఎంతో ప్రేమించి రాసుకున్న కథ ఇది’’ అన్నారు సాయిరామ్‌శంకర్. ఆయన కథానాయకునిగా గోపీగణేశ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రోమియో’. ‘పూరీ రాసిన ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. ‘టచ్‌స్టోన్’ దొరైస్వామి నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం విలేకరులతో సాయిరామ్‌శంకర్ ముచ్చటిస్తూ -‘‘రోమియో-జూలియట్ కథ జరిగిన ప్రాతం యూరప్ లోని వెరోనా.
 
 ప్రేమికులకు అదొక పుణ్యక్షేత్రం. చాలామంది అక్కడకొచ్చి తమ ప్రేమ సఫలం కావాలని మొక్కుకుంటుంటారు. ఆ ప్రాంతానికెళ్లి స్ఫూర్తి పొంది అన్నయ్య రాసిన కథ ఇది. ‘బంపర్ ఆఫర్’ తర్వాత మళ్లీ అన్నయ్య కథలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఆద్యంతం కొత్తగా సాగే ఈ సినిమాలో నా పాత్ర స్టయిలిష్‌గా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఇందులో కథానాయికగా నటించిన అడోనికా పక్కా తెలుగమ్మాయి. హైదరాబాద్‌లోనే రేడియో జాకీగా పనిచేసింది. చూడటానికి విదేశాల్లో పెరిగిన అమ్మాయిలా అనిపిస్తుంది.
 
 అందుకే... తనను కథానాయికగా ఎంపిక చేశారు. అనుకున్న దానికంటే చక్కగా నటించింది. తప్పకుండా పెద్ద హీరోయిన్ అవుతుంది’’ అని సాయి చెప్పారు. రవితేజ గురించి చెబుతూ -‘‘కథ మలుపు తిప్పే పాత్రను రవితేజ పోషించారు. అంతటి స్టార్‌డమ్ ఉన్న ఏ హీరో ఇలాంటి పాత్ర చేయడానికి అంగీకరించడు. కానీ నాపై అభిమానం కావచ్చు, అన్నయ్య ప్రేరణ కావచ్చు, ఏదైతేనేం రవితేజ నటించారు. రెండుమూడు సీన్లలో కనిపించి, సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్లిపోతారాయన. ఈ సినిమాలో ఆయన పాత్రే హైలైట్’’ అన్నారు సాయిరామ్ శంకర్.
 
 ఈ సినిమా తర్వాత తప్పకుండా దర్శకుడు గోపీగణేశ్ అగ్ర దర్శకుల జాబితాలో నిలబడతాడనీ, తక్కువ సమయంలో, అనుకున్న బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని ఆయన మలిచాడనీ సాయిరామ్‌శంకర్ పేర్కొన్నారు. దర్శకత్వ శాఖలో పనిచేసినా... ప్రస్తుతం నటనపైనే దృష్టిని కేంద్రీకరించాననీ, భవిష్యత్తులో దర్శకత్వం చేస్తాననీ ఆయన తెలిపారు. తమిళ నటుడు శరత్‌కుమార్‌తో కలిసి ‘జగదాంబ’ అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నట్లు సాయిరామ్‌శంకర్ తెలిపారు.