రవితేజ క్రాక్‌

15 Nov, 2019 04:23 IST|Sakshi

‘డాన్‌శీను, బలుపు’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి హైదరాబాద్‌లో గురువారం కొబ్బరికాయ కొట్టారు. సరస్వతి ఫిలింస్‌ డివిజన్‌ బ్యానర్‌పై ‘ఠాగూర్‌’ మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘క్రాక్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ‘బలుపు’ చిత్రం తర్వాత రవితేజ సరసన మరోసారి ‘క్రాక్‌’లో హీరోయిన్‌గా నటిస్తున్నారు శృతీహాసన్‌. ముహూర్తపు సన్నివేశాకి రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇచ్చారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.

నిర్మాత ‘దిల్‌’ రాజు, డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందించారు. గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ– ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథ ఇది. ఈ నెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

‘‘క్రాక్‌’ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు’’ అన్నారు ‘ఠాగూర్‌’ మధు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్మాతలు డి.సురేష్‌బాబు, ఎన్‌.వి.ప్రసాద్, సుధాకర్‌ రెడ్డి, నవీన్‌ ఎర్నేని, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, రామ్‌ తాళ్లూరి, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దాము తదితరులు పాల్గొన్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని, దేవీ ప్రసాద్, పూజిత పొన్నాడ, చిరాగ్‌ జాని తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్, కెమెరా: జి.కె.విష్ణు, సహ నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా