అందం చూడవయా.. ఆనందించవయా

18 May, 2017 03:10 IST|Sakshi
అందం చూడవయా.. ఆనందించవయా

అందాన్ని కోరుకోని వారు, ఆస్వాదించని వారుండరు. అందుకే అందరూ అందాన్ని మెరుగు పరచుకోవడానికి తెగ తాపత్రయ పడుతుంటారు. ముఖ్యంగా మగువలు అందంగా కనిపించడానికి రకరకాల క్రీములు పూసేస్తుంటారు. మరి కొందరైతే సినిమా కథానాయికలు చాలా అందంగా ఉంటారు. వారి సౌందర్య రహస్యం ఏంటబ్బా అని అనుకుంటారు. అలాంటి వారి కోసం నటి రెజీనా చెప్పే బ్యూటీ టిప్స్‌ ఏమిటో చూద్దాం. అందం కోసం అంటూ తాను ప్రత్యేకంగా టిప్స్‌ లాంటివేవీ ఉపయోగించనన్నారు.

 అయితే తాను ఎప్పుడైతే నటినయ్యానో అప్పటి నుంచి డైట్‌ చేయడం ప్రారంభించానని చెప్పారు. ముఖ్యంగా కసరత్తులు చేయడం ఒక్క రోజు కూడా మాననని తెలిపారు. అదే విధంగా యోగా, ధ్యానం చేయడం తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. షూటింగ్‌ అవుట్‌డోర్‌లో జరిగితే అక్కడ ఎక్స్‌ర్‌సైజ్‌కు అనువైన చోటును ఎంచుకుంటానని తెలిపారు. ఇలాంటివి క్రమం తప్పకుండా చేయడమే తన సౌందర్య రహస్యం అని అంటున్న నటి రెజీనా ప్రస్తుతం కోటీవుడ్, టాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

ఆదిలో కోలీవుడ్‌లో నిరాధరణకు గురైనా కేడీబిల్లా కిల్లాడిరంగా, రాజతందిరం, ఇటీవల తెరపైకి అనూహ్య విజయాన్ని అందుకున్న మానగరం వంటి చిత్రాలు రెజీనాను సక్సెస్‌ఫుల్‌ నాయకిగా నిలబెట్టాయి. సమీపకాలంలో ఉదయనిధి స్టాలిన్‌తో నటించిన సవరణన్‌ ఇరుక్క భయమేన్‌ చిత్రంలో అందాలారబోత విషయంలో పట్టువిడుపులు పాటించారనే ప్రచారం కోలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. దీంతో అమ్మడి చేతిలో ప్రస్తుతం అరడజను చిత్రాలున్నాయి.