పొంగల్‌ పోరులో...

18 Nov, 2018 05:17 IST|Sakshi
‘పేట్టా’లో రజనీకాంత్‌

సినిమా రిలీజ్‌లకు ‘బెస్ట్‌ సీజన్స్‌’లో సంక్రాంతి ఒకటి. తెలుగువారికి సంక్రాంతి అంటే తమిళంలో ‘పొంగల్‌’. మూడు నాలుగు రోజుల స్కూల్‌ సెలవులను, ఆఫీస్‌ సెలవులను క్యాష్‌ చేసుకోవడానికి సరైన సమయం. వచ్చే ‘పొంగల్‌ పోరు’లో నిలిచేది ఎవరు? అనేది ఇప్పుడు తమిళనాడు కోడంబాక్కమ్‌ ఏరియాలో హాట్‌ టాపిక్‌. మనకు ఫిల్మ్‌ నగర్‌ అయితే.. అక్కడ కోడంబాక్కమ్‌ అన్నమాట. ఇక.. పొంగల్‌ సందడి గురించి తెలుసుకుందాం.

4 రోజుల ముందే పండగ
పండగ స్టార్ట్‌ అవ్వడానికి 4 రోజులు ముందే ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘పేట్టా’ చిత్రం జనవరి 10న విడుదల కానుందని సమాచారం. ‘బాషా’ (1995) సినిమా తర్వాత రజనీకాంత్‌ నటించిన ఏ సినిమా కూడా పొంగల్‌కి రిలీజ్‌ కాలేదు. అందుకే పొంగల్‌కి ‘పేట్టా’ అనగానే అభిమానుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి. ‘బాషా’ సినిమాలో రజనీకాంత్‌ రెండు క్యారెక్టర్స్‌లో కనిపిస్తారు. ‘పేట్టా’ సినిమాలో కూడా రజనీకాంత్‌కు చెందిన రెండు డిఫరెంట్‌ లుక్స్‌ను ఆల్రెడీ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. మరి.. ‘బాషా’ రేంజ్‌లో ‘పేట్టా’ కూడా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తుందా? లేదా అని తెలియడానికి కాస్త టైమ్‌ ఉంది.

ఇంకో విశేషం ఏంటంటే... దాదాపు 15ఏళ్లుగా ఇండస్ట్రీలో కథానాయికగా ఉన్న త్రిష కెరీర్‌లో తొలిసారి రజనీకాంత్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న చిత్రమిది. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తొలిసారి తమిళ సినిమాలో నటించారు. సిమ్రాన్, విజయ్‌ సేతుపతి, మాళవికా మోహనన్, మేఘా ఆకాష్, సనత్‌రెడ్డి, బాబీ సింహాలతో పాటు డైరెక్టర్లు మహేంద్రన్, శశికుమార్‌ నటించిన ఈ సినిమాకు అనిరు«ద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించారు. ఈ ఏడాది జూన్‌లో ‘కాలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీకాంత్‌ ‘2.ఓ’ సినిమాతో ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మళ్లీ 45 రోజులకే థియేటర్స్‌లో కనిపించనుండటం విశేషం. సంక్రాంతికి ‘పేట్టా’గా వస్తున్నారు. జస్ట్‌ ఏడు నెలల్లో రజనీకాంత్‌ నటించిన మూడు సినిమాలు రావడం అంటే ఫ్యాన్స్‌కు పండగే కదా.

తలైవర్‌ వర్సెస్‌ తల?
అజిత్‌ ‘విశ్వాసం’ సినిమాతో పొంగల్‌కి రాబోతున్నారు. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నయనతార కథానాయిక. ‘వీరమ్, వేదాలం, వివేగమ్‌’ వంటి హిట్‌ మూవీస్‌ తర్వాత అజిత్‌–శివ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. ఇటీవలే రిలీజ్‌ చేసిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను బట్టి అజిత్‌ ‘విశ్వాసం’ సినిమాలో డ్యూయల్‌ రోల్‌ చేశారని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్‌ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. మరి.. బాక్సాఫీస్‌ వద్ద తలైవర్‌ రజనీకాంత్‌తో తల అజిత్‌కు పోరు తప్పదా? అంటే అదేం లేదు అంటున్నాయి కోడంబాక్కమ్‌ వర్గాలు. ‘పేట్టా’ సినిమా జవనరి 10కి రిలీజ్‌ కానుందట. ‘విశ్వాసం’ చిత్రాన్ని జనవరి 14కి ప్లాన్‌ చేస్తున్నారు. సో.. 4 రోజులు గ్యాప్‌ ఉంది. ‘నో వార్‌’  అని జోస్యం చెబుతున్నారు. కానీ అధికారికంగా విడుదల తేదీని రెండు చిత్రవర్గాలూ ప్రకటించలేదు. అయితే రెండూ జనవరిలో విడుదలవ్వడం ఖాయం.

 ‘విశ్వాసం’లో అజిత్‌

రాజులా వస్తాను
శింబు హీరోగా సుందర్‌. సి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వందా రాజావాదాన్‌ వరువేన్‌’. తెలుగు హిట్‌ ‘అత్తారింటికి దారేది’ సినిమాకు ఇది రీమేక్‌. ఇందులో మేఘా ఆకాష్, కేథరిన్‌ కథానాయికలు. ఈ సినిమా కూడా పొంగల్‌ రేస్‌లో నిలిచింది. అయితే పేట్టా, విశ్వాసం సినిమాలు పొంగల్‌కి వస్తున్నాయి కాబట్టి ‘వందా రాజావాదాన్‌ వరువేన్‌’ సినిమా పొంగల్‌ తర్వాత రిలీజ్‌ అవుతుందని అనుకున్నారు. కానీ పొంగల్‌కి వరోమ్‌ (పొంగల్‌కి వస్తున్నాం) అని ఓ స్టేట్‌మెంట్‌ను రిలీజ్‌ చేశారు శింబు. అలాగే తన గురించి కోలీవుడ్‌లో వినిపిస్తున్న రెడ్‌ కార్డ్‌ (‘ఏఏఏ’ సినిమాకి సంబంధించిన సమస్యని ఉద్దేశించి) గురించి కూడా ఆందోళన చెందవద్దని కూడా ఆ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు శింబు.

 ‘వందా రాజావాదాన్‌ వరువేన్‌’లో శింబు

బాలాజీ ఎల్‌కేజీ
ఇంతకాలం హాస్యనటుడిగా వెండితెరపై ప్రేక్షకులను నవ్వించారు ఆర్జే బాలాజీ. ఇంతకు ముందు రేడియో జాకీగా వర్క్‌ చేశారు. ప్రస్తుతం ఆయన లీడ్‌ రోల్‌ చేస్తున్న సినిమా ‘ఎల్‌.కే.జీ’. టైటిల్‌ బట్టి ఇదేదో చిన్న పిల్లల సినిమా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది పొలిటికల్‌ సెటైరికల్‌ మూవీ. ఇందులో ప్రియా ఆనంద్‌ కథానాయికగా నటిస్తున్నారు. ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పొంగల్‌కి రిలీజ్‌ చేస్తున్నట్లు ఆర్జే బాలాజీ తెలిపారు. మరి... రజనీకాంత్, అజిత్, శింబు వంటి స్టార్స్‌ సినిమాలు వస్తున్న టైమ్‌లో బాలాజీ ‘ఎల్‌.కే.జీ’ వస్తే? రావాలంటే దమ్ముండాలి. సినిమా మీద బోలెడంత నమ్మకం ఉండాలి. ఈ చిత్రబృందానికి ఈ రెండూ ఉన్నట్లున్నాయి. అందుకే పొంగల్‌ పోరుకి రెడీ అవుతున్నారు.

 ‘ఎల్‌కేజీ’లో ఆర్జే బాలాజీ

మరిన్ని వార్తలు