సినిమా రివ్యూ: రేసుగుర్రం

11 Apr, 2014 19:30 IST|Sakshi
సినిమా రివ్యూ: రేసుగుర్రం
 
ప్లస్ పాయింట్స్: 
అల్లు అర్జున్, 'కిక్' శ్యామ్, రవి కిషన్, బ్రహ్మానందం యాక్టింగ్
శృతి హాసన్ గ్లామర్
సాంగ్స్, కామెడీ
 
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ
ఫైట్స్
 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ 'రేసుగుర్రం'  ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. దానికి తోడుగా ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న విడుదలైన రేసుగుర్రం ఎలాంటి అనుభూతిని మిగిల్చిందో తెలుసుకోవాలంటే ముందు కథ గురించి తెలుసుకోవాల్సిందే.

లక్ష్మణ్ ఉరప్ లక్కీ, రామ్ ఇద్దరూ అన్నదమ్ములు. నీతి, నిజాయితీ ఉన్న బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ రామ్, ఎప్పుడూ జల్సాగా తిరిగే లక్కీలకు క్షణం కూడా పడదు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో గొడవ పడుతుంటారు. ఈ క్రమంలో స్పందన (శృతి హాసన్)తో లక్కీ ప్రేమలో పడతాడు. అయితే ఓ కారణంగా లక్కీ, స్పందన ప్రేమ వ్యవహారానికి బ్రేక్ వేసేందుకు రామ్ ప్లాన్ వేస్తాడు. శృతిని తనకు దక్కకుండా చేసిన రామ్కు తగిన గుణపాఠం చెప్పాలని అతని పోలీస్ కారును దొంగిలిస్తాడు. లక్కీ దొంగిలించిన కారులో ఉన్నది రామ్ అనుకుని రాజకీయవేత్తగా మారిన రౌడీ మద్దాలి శివారెడ్డి వర్గం ఎటాక్ చేసి చంపాలనుకుంటాడు. ఆ దాడి నుంచి లక్కీ క్షేమంగా బయటపడుతాడు. ఆ దాడి నుంచి బయటపడిన శివారెడ్డి ఏం చేశాడు? శివారెడ్డికి రామ్ మధ్య శతృత్వానికి కారణమేంటి? లక్కీ, స్పందనల ప్రేమ వ్యవహారాన్ని రామ్ ఎందుకు బ్రేక్ చేయాలనుకుంటాడు? రామ్, లక్కీల మధ్య ఉన్న మనస్పర్ధలు ఎలా తొలగిపోయాయి అనే సమస్యలకు ముంగిపే 'రేసుగుర్రం' చిత్ర కథ.

పెర్ఫార్మెన్స్:
అల్లు అర్జున్లో ఎనర్జీ లక్కీ పాత్రకు సూట్ అయింది. యాక్షన్, ఎంటర్టైన్ మెంట్, లవ్ సీన్స్లో నటించడం అర్జున్కు కొత్తేమీ కాదు. తనదైన శైలిలో లక్కీ పాత్రలో ఉండే వివిధ కోణాలకు అల్లు అర్జున్ న్యాయం చేకూర్చారు. స్పందనగా శృతి హాసన్ గత చిత్రాల్లో ఎన్నడూ లేనంతగా గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. స్పందన పాత్రలో ఓ ఢిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. దాన్ని శృతి హాసన్ బాగా పండించింది. కిక్ శ్యామ్ ప్రేయసిగా సలోని గెస్ట్ గా కనిపించింది. ఈ చిత్రంలో తనకు లభించిన సీన్లలో తెలంగాణ యాసలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అంతగా గుర్తుండిపోయే పాత్రేమీ కాదు.

కిక్ శ్యామ్ పోలీస్ ఆఫీసర్గా, అల్లు అర్జున్ అన్నగా పర్వాలేదనిపించాడు. కిక్ తర్వాత అలాంటి తరహా పాత్రనే రిపీట్ చేశాడా అనిపించింది. మెయిన్ విలన్గా మద్దెల శివారెడ్డి పాత్రలో భోజ్పూరి నటుడు రవికిషన్ నటించాడు. రౌడీగా మారిన రాజకీయవేత్తగా రవికిషన్ వీలైనంత మేరకు మంచి నటనే అందించాడు.


మరోసారి బ్రహ్మనందం కామెడీతో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఓ ప్రత్యేక పోలీస్ ఆఫీసర్ కిల్ బిల్ పాండే గా క్లైమాక్స్లో  హంగామా చేశాడు. ప్రీ క్లైమాక్స్ ఎంటరై.. క్లైమాక్స్ వరకు చిత్ర భారాన్ని తన భుజాలపై బ్రహ్మానందం ఎత్తుకున్నాడు. చిత్రమంతా రొటీన్గా ఉందే అనుకునే సమయంలో మరోసారి తన ప్రతిభతో ప్రేక్షకులకు కొంత ఊరట కలిగించాడు. శ్రీనివాస్ రెడ్డి, తాగుబోతు రమేశ్ తదితర కమెడియన్లు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

స్పందన తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించాడు. కొన్ని సీన్లకు తనదైన స్టైల్లో ప్రకాశ్ రాజ్ న్యాయం చేశాడు. మిగతా పాత్రల్లో తనికెళ్ల భరణి, ముఖేశ్ రుషి నటించారు.

టెక్నికల్:
తమన్ సంగీతం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోరు కీలక సన్నివేశాలకు మంచి సపోర్ట్ ఇచ్చింది. పాటల్లో అర్జున్ పై చిత్రీకరించిన సోలో సాంగ్... బూచోడే, 'సినిమా చూపిస్త మామా' పాటలు ఆడియో పరంగానే కాకుండా తెరపై కూడా ఆకట్టుకున్నాయి.
టెక్నికల్ అంశాలు చూస్తే మనోజ్ పరమహంస కెమెరా చాలా రిచ్గా ఉంది. శృతి హాసన్, అల్లు అర్జున్ క్యాస్టూమ్ అదిరిపోయేలా ఉన్నాయి. కొత్త లుక్ తో డిజైన్ చేసిన క్యాస్టూమ్ శృతి, అల్లు అర్జున్ కు మరింత గ్లామర్ ను పెంచాయి. 

డైరెక్షన్:
టేకింగ్లో దర్శకుడు సురేందర్ రెడ్డి టాలీవుడ్లో విలక్షణమైన శైలి అని గత చిత్రాలతో నిరూపించుకున్నాడు. ఈ చిత్రం విషయానికి వస్తే కథ కన్నా అల్లు అర్జున్లోని స్టైలిష్ పెర్ఫార్మెన్స్, బ్రహ్మనందం కామెడీనే ఎక్కువగా నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. కిక్ సినిమాలో ఆలీ క్యారెక్టర్ను కొనసాగింపుగా ఈ చిత్రంలో ఇంట్రడ్యూస్ చేసినా సరైన స్పేస్ లేని కారణంగానో, ఇతర పరిమితుల కారణంగానో బెడిసి కొట్టింది. ముఖేశ్ రుషి, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ క్యారెక్టర్లను సరైన దృష్టి పెట్టకుండా వదిలేశాడనే ఓ చిన్న ఫీలింగ్ కలుగుతుంది. రొటీన్ కథ, కొత్తదనం లేని విలనిజంతో చేసిన సాహసం అనుకున్నంతగా ఫలితాన్ని ఇవ్వకపోయినా.. క్లైమాక్స్లో బ్రహ్మానందాన్ని తీసుకొచ్చి మంచి మార్కులే కొట్టేశారు. బ్రహ్మనందం ఎపిసోడ్ నడిపించిన తీరు గ్రిప్పింగ్ గా ఉంది. ఈ చిత్రంలోని 'రేసుగుర్రం' అర్జున్ ఎనర్జీని బ్రహ్మానందానికి ఇచ్చేసి రొటీన్కు భిన్నంగా కొత్త ముగింపు ఇచ్చే ప్రయత్నం చేశారు. సెకంఢాఫ్ లో కథపై కొంత ఎక్సర్ సైజ్ చేసి ఉంటే మంచి ఫలితాలన్ని రాబట్టే అవకాశం ఉండేది. మార్కెట్లో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ పై దృష్టి సారిస్తున్నారనే ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మాస్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అంశాలను జోడించి రేసుగుర్రాన్ని పరిగెత్తించిన సురేందర్ రెడ్డి... వినోదాన్ని ఆశించిన ప్రేక్షకుల్లో సంతృప్తి నింపి.. కొత్తదనం ఆశించిన వారిని కొంచెం నిరాశకు గురి చేశాడు.

ట్యాగ్: బ్రహ్మీ బలంతో పరుగెత్తిన రేసుగుర్రం