సినిమా దర్శకుడిగా మారిన రిటైర్డ్‌ న్యాయమూర్తి!

8 Sep, 2018 19:33 IST|Sakshi

సాక్షి, తమిళసినిమా: ఇతర రంగాల్లో పేరు, ప్రఖ్యాతలు గండించిన ప్రముఖులు సైతం సినిమారంగంలోకి అడుగుపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ కోవలో విశ్రాంత న్యాయమూర్తి చేరబోతున్నారు. విశ్రాంత న్యాయమూర్తి అయిన ఎం. పుహళేంది త్వరలో మెగాఫోన్‌ పట్టనున్నారు. కథ, కథనం, మాటలు, పాటలు, దర్శకత్వంతోపాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టి.. సెల్లమ్‌ అన్‌కో క్రియేషన్స్‌ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘వేదమానవన్’ .. మనోజయంత్‌ అనే నూతన నటుడు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మధ్యప్రదేశ్‌ మోడల్‌ ఊర్వశీ జోషీ హీరోయిన్‌గా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఢిల్లీగణేశ్, బెంజిమిన్, బోండామణి, ములైయూర్‌ సోనై ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం ఎస్‌.కన్నన్‌... సంగీతం సౌందర్యన్‌ అందిస్తున్నారు. ‘ఒక ఉరి శిక్ష ఖైదీ విడుదలై వస్తే అతన్ని ఊరు ప్రజలు తమతో కలుపుకుంటారా లేదా అన్న ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం వేదమానవన్‌’అని దర్శకుడు పుహళేంది తెలిపారు. ఇందులో ప్రేమ, శోకం, వీరం, హాస్యం తదితర అంశాలుంటాయని, సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించాలన్న ఉద్దేశంతో తాను తీర్పులిచ్చిన అంశాలను తీసుకుని ఈ చిత్రకథను తయారు చేసుకున్నానని తెలిపారు. తాను ఇప్పటివరకూ తమిళం, ఇంగ్లిష్‌ భాషల్లో 22 నవలలు రాశానని తెలిపారు. అదేవిధంగా 2015లో చెన్నైని ముంచెత్తిన వరద ఘోరాన్ని యథాతథంగా పుస్తకంగా రాసినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎస్‌.మోహన్‌ సలహాతో తాను సాహితీరంగం నుంచి సినీ రంగంలోకి వచ్చినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు