నా లైఫ్‌ బ్యూటిఫుల్‌

25 Dec, 2019 00:37 IST|Sakshi
టి. అంజయ్య, నైనా గంగూలి, రామ్‌గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు, సూరి

– రామ్‌గోపాల్‌ వర్మ  

‘‘మనసుకి ఆహ్లాదం కలిగించి మనల్ని ఉద్రేకానికి గురి చేసే ఏ ఎమోషన్‌ అయినా బ్యూటిఫుల్‌. నా హిట్‌ని ఎంత బ్యూటిఫుల్‌గా తీసుకుంటానో నా ఫ్లాప్‌ని కూడా అంతే బ్యూటిఫుల్‌గా తీసుకుంటాను. నా జీవితంలో ఎవరిపైనా ఫిర్యాదు చేయను.. నాకు ఎవరి మీదా కోపం రాదు. నేను బ్యూటిఫుల్‌ కాకపోవచ్చు.. కానీ నా లైఫ్‌ మాత్రం బ్యూటిఫుల్‌’’ అని రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. నైనా గంగూలి, సూరి జంటగా రామ్‌గోపాల్‌ వర్మ టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్‌ పతాకంపై అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్యూటిఫుల్‌’.

‘ట్రిబ్యూట్‌ టు రంగీలా’ అనేది ఉపశీర్షిక. టి.అంజయ్య సమర్పణలో టి. నరేష్‌ కుమార్, టి. శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘ఊర్మిళ లాంటి అమ్మాయి లేకుంటే నేను ‘రంగీలా’ సినిమా తీసుండేవాణ్ణి కాదు. ఇప్పుడు నైనా విషయంలోనూ అదే జరిగింది. కొంతమంది యాక్టర్స్‌ కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టర్స్‌ కోసమే క్రియేట్‌ అయ్యారనిపిస్తుంది. నేను పదిహేనేళ్లుగా లవ్‌ స్టోరీ జోలికి వెళ్లలేదు. దానికి రెండు కారణాలు.. ఒకటి నన్ను అంతగా ఇన్‌స్పైర్‌ చేసిన కథ రాలేదు.

రెండోది అంతగా ఇన్‌స్పైర్‌ చేసిన యాక్టర్‌ దొరకలేదు.. అవి రెండూ కుదిరాయి కాబట్టే ఈ సినిమా మొదలుపెట్టాం’’ అన్నారు. అగస్త్య మంజు మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా ముంబైలో ఉన్న ధారావి అనే ప్రాంతంలో జరుగుతుంది. ఆ ప్రాంతం అంత  ‘బ్యూటిఫుల్‌’ ప్లేస్‌ కాదు. కానీ అక్కడి మనుషులు బ్యూటిఫుల్‌గా ఉంటారు. అందుకే ఆ పేరు పెట్టాం’’ అన్నారు. ‘‘రాము త్వరలోనే ‘శివ’లాంటి సినిమా తీయాలని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్‌. ‘‘మా సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. పెద్ద సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు టి.అంజయ్య. ఈ వేడుకలో రామ్‌గోపాల్‌ వర్మ డ్యాన్స్‌ చేయడం విశేషం. ఈ వేడుకలో నిర్మాతలు నట్టి కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకులు చంద్ర సిద్ధార్థ్, బీవీఎస్‌ రవి, హీరో ఆకాష్‌ పూరి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు