ఆ వార్తల్లో నిజంలేదు

1 Mar, 2019 01:00 IST|Sakshi
విజయ్, యజ్ఞా శెట్టి

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. ఏ జీవీ ఆర్జీవీ ఫిల్మ్స్‌ సమర్పణలో రాకేష్‌ రెడ్డి–దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. అయితే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు ఎవరో కొన్నారంటూ ఆన్‌లైన్‌లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని, అవన్నీ కేవలం పుకార్లే అని నిర్మాతలు కొట్టిపారేశారు. ‘‘ఎవరికి, ఎంత ఖరీదుకి ఫైనల్‌ చేయబోతున్నారన్న వివరాలు రామ్‌గోపాల్‌ వర్మ, రాకేష్‌ రెడ్డిలు త్వరలోనే తెలియజేస్తారు.

మా చిత్రాన్ని ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్‌ చేయబోతున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ‘‘మా సినిమా ట్రైలర్, ఓ పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ స్పందన చూస్తుంటే సినిమా క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆర్జీవీ యూట్యూబ్‌ చానల్‌లోనే కోటిమందికిపైగా చూశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన  ‘నీ ఉనికి...’ పాటని 30 లక్షల మందికిపైగా చూశారు. వీటన్నిటినీ చూస్తుంటే  మా సినిమాకి థియేటర్లలో జనాలు బ్రహ్మరథం పట్టడం ఖాయం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: రమ్మీ, సంగీతం: కళ్యాణ్‌ కోడూరి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సూర్య చౌదరి.

మరిన్ని వార్తలు