తిక్క నిండిన తెలివైనోడు... వర్మ!

21 Mar, 2016 02:04 IST|Sakshi
తిక్క నిండిన తెలివైనోడు... వర్మ!

ఇటీవలే హైదరాబాద్ నుంచి ముంబయ్‌కి మకాం మార్చేసి, మళ్ళీ చేతి నిండా హిందీ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. విజయవాడలోని ఒకప్పటి గ్యాంగ్‌వార్‌ల నేపథ్యంలో తెలుగులో ‘వంగవీటి’ చిత్రానికి శ్రీకారం చుట్టిన వర్మ మరోపక్క మూడు, నాలుగు హిందీ ప్రాజెక్ట్‌ల ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ నిశ్శబ్దంగా చేస్తున్నారట! వాటిలో ఒకప్పటి అండర్‌వరల్డ్ క్రైమ్ సినిమా ‘కంపెనీ’కి సీక్వెల్ ‘కంపెనీ-2’ కూడా ఉంది. పధ్నాలుగేళ్ళ క్రితం 2002లో ‘కంపెనీ’తో సినీ రంగ ప్రవేశం చేసిన హీరో వివేక్ ఓబెరాయ్ ఇప్పుడీ సీక్వెల్‌లో కూడా కథానాయకుడు. ‘‘గ్యాంగ్‌స్టర్ సినిమాలు, నేరసామ్రాజ్యం నేపథ్యంలో నడిచే క్రైమ్ సినిమాలు తీయాలంటే వర్మను మించిన మేధావి మరొకరు లేరు. ఆయన పనితనమంటే నాకు చాలా ఇష్టం’’ అని 39 ఏళ్ళ వివేక్ ఓబెరాయ్ అంటున్నారు. ‘‘వర్మ పని అయిపోయిందని చాలామంది అంటున్నారు. కానీ, నాకు వాటితో పని లేదు. నా దృష్టిలో ఆయన తిక్క నిండిన తెలివైనవాడు’’ అని వివేక్ వ్యాఖ్యానించారు. ‘‘వర్మతో ‘కంపెనీ-2’ చేయడం గురించి ఆందోళన పడట్లేదు. నా కెరీర్‌లో కూడా ఒడుదొడుకులున్నాయి. కానీ, మేమంతా మళ్ళీ పుంజుకుంటాం’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.

 నిర్మాతగా వివేక్ తొలి ప్రయత్నం
దావూద్ ఇబ్రహీమ్ ముఠా ‘డి-కంపెనీ’ వివరాలను ఆధారంగా చేసుకొని అజయ్ దేవ్‌గణ్, మనీషా కొయిరాలా, మోహన్‌లాల్ ప్రభృతులతో అప్పట్లో వర్మ ‘కంపెనీ’ తీశారు. ‘‘అది 14 ఏళ్ళ క్రితం సంగతి. ఆ సినిమా ద్వారా హిందీ చిత్రసీమలో నాకు స్థానం కల్పించిన వర్మకు కృతజ్ఞతలు. నాలోని ప్రతిభను ఆయనే బయటకు తీశారు. ఆ కెరీర్‌లో మైలురాయిగా నిలిచి, సినీ చరిత్రలో అందరికీ గుర్తుండిపోయిన ఆ సినిమాకు తగ్గట్లే ఇప్పుడీ రెండో పార్ట్‌ను కూడా ఆసక్తికకరంగా తీర్చిదిద్దుతున్నాం’’ అని వివేక్ ఓబెరాయ్ చెప్పారు. ఈ సినిమాతో వివేక్ నిర్మాత అవతారం కూడా ఎత్తడం విశేషం. హిందీ, తెలుగు, తమిళాల్లో రూపొందే ఈ చిత్రంలోని తన పాత్ర గురించి మాత్రం ఆయన పెదవి విప్పలేదు. ఈ ఏడాది మధ్యలో ఈ ‘కంపెనీ-2’ సెట్స్ మీదకు వెళ్ళనుంది.