30 ఏళ్ల క్రితం రామోజీరావు కోసం వర్మ ఆర్టికల్

9 Oct, 2017 13:14 IST|Sakshi

సాక్షి : సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కొత్త సినిమాలతోపాటు పాత తరాల ముచ్చట్లను కూడా షేర్‌ చేసుకుంటుంటాడు. తాజాగా 30 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో మీడియా మొఘల్‌గా పలువురు పిలుచుకునే రామోజీరావు దృష్టిలో పడేందుకు చేసిన యత్నాన్ని వర్మ వివరించాడు. 

‘అది నేను సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయం. అదే సమయంలో శ్రీవారికి ప్రేమ లేఖ, మయూరి, ప్రతిఘటన లాంటి అసాధారణమైన హిట్లతో రామోజీరావు గారు దూసుకుపోతున్నారు. వెంటనే ఆయన్ని కలవాలని ప్రయత్నించా. అయితే అంత పెద్ద సెలబ్రిటీని కలవటం అంటే మాటలు కాదు కదా. అందుకే ఓ పని చేశా. ‘ది ఐడియాస్‌ కిల్డ్‌ 50 మిలియన్‌ పీపుల్‌’ పేరిట ఓ ఆర్టికల్ రాసి ఆ సమయంలో ఆయన నడిపించిన న్యూస్‌టైం అనే పేపర్‌కు పంపించా. నా ఆర్టికల్‌ ప్రచురితమై నా పేరు మారుమోగిపోగా.. ఎట్టకేలకు నాకు ఆయన అపాయింట్ మెంట్‌ దొరికింది. 

అయితే అనుభవలేమి కారణంగా ఆయన నాకు దర్శకత్వ అవకాశం ఇచ్చేందుకు నిరాకరించారు. దర్శకుడికి కావాల్సిందిగా క్రియేటివిటీ కానీ.. అనుభవం కాదని ఎంత వివరించినా.. ఆ వాదనతో ఆయన అంగీకరించలేకపోయారు. అయితే ఆయన పేపర్‌ కాలమిస్ట్‌గా నాకు అవకాశం ఇస్తానని చెప్పారు’ అని వర్మ వివరించాడు. 

ఏదీ ఏమైనా ఆ వ్యాసం తనకు గుర్తింపు తెచ్చిందని.. తన కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషించారని ఆర్జీవీ చెప్పాడు. కానీ, అది పోవటంతో ఇన్నాళ్లూ చాలా బాధపడ్డానని.. అయితే రాజా తన స్నేహితుడొకరు దాని చాలా జాగ్రత్తగా భద్రపరిచి ఇప్పుడు తనకు ఇచ్చాడని ఆ వ్యాసాన్ని పేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. రెండో ప్రపంచ యుద్ధం.. నాజియిజం... హిట్లర్‌ ల ప్రస్తావనతో ఆయన ఆ వ్యాసం రాశాడు.

మరిన్ని వార్తలు